Saim Ayub: చెత్త రికార్డుకు అడుగు దూరంలో పాక్ ప్లేయర్.. భారత్‌తో ఫైనల్ ముందు టెన్షన్

Saim Ayub Nears Unwanted Record Before India Final
  • ఆసియా కప్ 2025లో దారుణంగా విఫలమవుతున్న పాక్ బ్యాటర్ సయీమ్ ఆయుబ్
  • ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు సార్లు డకౌట్‌
  • టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక డకౌట్ల రికార్డుకు చేరువైన ఆయుబ్
  • మరోసారి డకౌట్ అయితే ఉమర్ అక్మల్ చెత్త రికార్డు సమం 
  • బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొడతాడంటూ టోర్నీకి ముందు మాజీల ప్ర‌గ‌ల్భాలు
ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఒకరు, "మా బ్యాటర్ సయీమ్ ఆయుబ్.. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదగలడు" అంటూ జోస్యం చెప్పాడు. కానీ, తీరా టోర్నీ మొదలయ్యాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆరు సిక్సర్లు కొట్టడం అటుంచి, ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు సార్లు డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ పాక్ ఓపెనర్, ఇప్పుడు ఒక చెత్త రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.

ఆసియాకప్ 2025లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సయీమ్ ఆయుబ్, అందులో నాలుగుసార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. టోర్నమెంట్‌లో అతని అత్యధిక స్కోరు కేవలం 21 పరుగులు మాత్రమే కావడం అతని పేలవ ఫామ్‌కు అద్దం పడుతోంది. ఇక టోర్నీ ఆసాంతం అతను కొట్టింది ఒకే ఒక్క సిక్సర్. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపిస్తాడని ఊహించిన అభిమానులకు ఇది తీవ్ర నిరాశ కలిగించింది.

ఈ వైఫల్యంతో సయీమ్ ఆయుబ్ టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ తరఫున ఓ చెత్త రికార్డును అందుకునే ప్రమాదంలో పడ్డాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో ఉమర్ అక్మల్ 10 డకౌట్లతో (79 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా ప్రదర్శనతో సయీమ్ ఆయుబ్ 9 డకౌట్లతో (45 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానానికి చేరాడు. వీరి తర్వాతి స్థానంలో షాహిద్ అఫ్రిది 8 డకౌట్లతో (90 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

ఆదివారం భారత్‌తో జరగనున్న ఆసియాకప్ ఫైనల్‌లో సయీమ్ ఆయుబ్ మరోసారి డకౌట్ అయితే, ఉమర్ అక్మల్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డును సమం చేస్తాడు. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు ముందు ఈ గణాంకాలు పాకిస్థాన్ జట్టును, ముఖ్యంగా సయీమ్ ఆయుబ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంది.

ఆసియా కప్ 2025లో సయీమ్ ఆయూబ్‌ స్కోర్లు వరుసగా ఇలా..
0 (1) వ‌ర్సెస్‌ ఒమన్
0 (1) వ‌ర్సెస్‌ భారత్
0 (2) వ‌ర్సెస్‌ యూఏఈ
21 (17) వ‌ర్సెస్‌ భారత్
2 (3) వ‌ర్సెస్‌ శ్రీలంక
0 (3) వ‌ర్సెస్‌ బంగ్లాదేశ్
Saim Ayub
Pakistan Cricket
Asia Cup 2025
Duck Out Record
Umar Akmal
India vs Pakistan Final
T20 Cricket
Jasprit Bumrah
Cricket Records
Pakistan Batting

More Telugu News