Kailash Vijayvargiya: రాహుల్, ప్రియాంక అనుబంధంపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Kailash Vijayvargiya Controversial Remarks on Rahul Priyanka Relationship
  • బహిరంగంగా చెల్లిని ముద్దుపెట్టుకోవడం విదేశీ సంస్కృతి అన్న కైలాశ్ విజయవర్గీయ
  •  ఇది భారతీయ సంప్రదాయం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు
  •  తన వ్యాఖ్యలను ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సమర్థించుకున్న మంత్రి
  •  అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
  •  మహిళలను కించపరచడం ఆయనకు అలవాటేనన్న కాంగ్రెస్ నేత జితు పట్వారీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య ఉన్న అనుబంధంపై మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని, అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో గురువారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజయవర్గీయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరి ఉండే ఊరిలో కనీసం నీళ్లు కూడా తాగం. కానీ మన ప్రతిపక్ష నేతలు నడిరోడ్డుపై తమ చెల్లెళ్లను ముద్దుపెట్టుకుంటున్నారు. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు" అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో, ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన మాటలను సమర్థించుకున్నారు. "అది రాహుల్ గాంధీ తప్పు కాదు. ఆయన విదేశాల్లో చదువుకుని అక్కడి విలువలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయనకు భారతీయ సంప్రదాయాల గురించి అవగాహన లేదు. ప్రధానమంత్రిని కూడా 'నువ్వు' అని సంబోధిస్తారు" అని విజయవర్గీయ పేర్కొన్నారు.

విజయవర్గీయ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ మాట్లాడుతూ "అమ్మవారిని పూజించే నవరాత్రుల సమయంలో అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధాన్ని అవమానించేందుకు కైలాశ్ విజయవర్గీయ పూనుకున్నారు. ఆయన భాష ఎలాంటిదో అందరికీ తెలుసు. గతంలోనూ దుస్తులు, చదువు, మాటతీరు అంటూ మహిళలను పదేపదే అవమానించారు. సోదరీమణులు, కుమార్తెలపై ఆయనకున్న ఆలోచనాధోరణి ఇదే. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలకు స్పందించడానికే సిగ్గుగా ఉంది" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Kailash Vijayvargiya
Rahul Gandhi
Priyanka Gandhi Vadra
BJP
Congress
Indian culture
politics
Madhya Pradesh
Jitu Patwari
brother sister relationship

More Telugu News