Donald Trump: పాకిస్థాన్‌కు దగ్గరవుతున్న అమెరికా... పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ తో ట్రంప్ భేటీ

Trump Meets Pakistan PM Shehbaz Sharif and Army Chief Asim Munir
  • షహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ లపై ట్రంప్ ప్రశంసలు
  • గొప్ప నాయకులు అంటూ కితాబు
  • ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య, ఖనిజ ఒప్పందాలే కారణం
"అబద్ధాలు, మోసాలు తప్ప పాకిస్థాన్ చేసిందేమీ లేదు" అని ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మారిన రాజకీయ, వాణిజ్య సమీకరణాల నేపథ్యంలో పాకిస్ధాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు వైట్‌హౌస్‌లో ఘనస్వాగతం పలికారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి సంకేతంగా నిలుస్తోంది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరైన ఈ సమావేశానికి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ "గొప్ప నాయకులు" అని కొనియాడారు. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వైట్‌హౌస్‌కు చేరుకున్నప్పుడు ట్రంప్ ఇతర కార్యక్రమాలలో ఉన్నప్పటికీ, వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఓవల్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది.

గతంలో ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తోందని ఆరోపించిన అమెరికా, ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడానికి బలమైన వాణిజ్య ప్రయోజనాలే కారణంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. పాకిస్థాన్‌లో లభించే అరుదైన ఖనిజాలు, నిక్షేపాలను అమెరికాకు సరఫరా చేసేందుకు ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఒక అమెరికన్ సంస్థ పాక్ ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాకుండా, పాకిస్థాన్‌లోని భారీ చమురు నిల్వలను వెలికితీయడంలో సహాయపడతామని ట్రంప్ గతంలోనే హామీ ఇచ్చారు.

ఈ వాణిజ్య ఒప్పందాల ఫలితంగా అమెరికా-పాకిస్థాన్ మధ్య వాణిజ్యం 10.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2023తో పోలిస్తే 6.3 శాతం అధికం. ఇటీవలే భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన సైనిక ఉద్రిక్తతలను తన జోక్యంతోనే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. ఈ వాదనను భారత్ ఖండించినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం అంగీకరించి, ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ పరిణామాలన్నీ అమెరికా వైఖరిలో మార్పునకు దోహదం చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరిసారిగా 2019లో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్‌హౌస్‌ను సందర్శించారు. 
Donald Trump
Pakistan
Shehbaz Sharif
Asim Munir
US Pakistan relations
Pakistan army chief
White House meeting
Pakistan trade
US foreign policy
Pakistan minerals

More Telugu News