Chandrababu Naidu: ఆ ప్రొఫెసర్ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu Credits Professor DL Narayana for Political Success
  • తన రాజకీయ గురువు ప్రొఫెసర్ డీఎల్ నారాయణ అని వెల్లడించిన చంద్రబాబు
  • రాజకీయాల్లోకి రావాలని ఆయనే తనను ప్రోత్సహించారని వ్యాఖ్య
  • తాను పెద్దగా చదువుకునేవాడిని కాదని, ఐఏఎస్ చదివే ఓపిక లేదని వెల్లడి
  • విద్యార్థుల్లోని నైపుణ్యాలను గుర్తించాలని ఉపాధ్యాయులకు సూచన
  • ఇప్పుడు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ అని స్పష్టం చేసిన సీఎం
తన రాజకీయ ప్రవేశానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి తన గురువు, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీఎల్ నారాయణ కారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తాను విద్యార్థి దశలో పెద్దగా చదివేవాడిని కాదని, కానీ తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి, ప్రోత్సహించింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో డీఎస్సీ ర్యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన జంధ్యాల అంజని అనే అభ్యర్థిని టెట్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)లో రెండో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రిని ఉద్దేశించి "మీ నాయకత్వ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడి గురించి చెప్పగలరా?" అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ "నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివాను. అప్పట్లో మాకు డీఎల్ నారాయణ అనే ప్రొఫెసర్ ఉండేవారు. నేను పెద్దగా చదువుకునేవాడిని కాదు. ఐఏఎస్ చదివేంత ఓపిక నాకు లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయాన్ని ఆయనే అన్ని విధాలా ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఆ తర్వాత రెండేళ్లకే మంత్రినయ్యాను. ఈ స్థాయికి వచ్చానంటే ఆరోజు ఆయన అందించిన ప్రోత్సాహమే కారణం" అని వివరించారు.

ఉపాధ్యాయులకు సీఎం సూచనలు
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. "కొంతమంది ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకరు గణితంలో, మరొకరు సైన్స్‌లో ప్రతిభావంతులుగా ఉంటారు. వారిలోని ఆ ప్రత్యేకతలను మీరు గుర్తించి బయటకు తీసుకురాగలిగితే వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది" అని అన్నారు.

ప్రస్తుత ప్రపంచానికి కావాల్సింది హార్డ్ వర్క్ కాదని, స్మార్ట్ వర్క్ అని ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలన్నదే తన ఆశయమని, ఆ శక్తిని వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu Naidu
DL Narayana
SV University
Andhra Pradesh
Politics
Teachers
Education
Jandyala Anjani
DSC Rankers
Smart Work

More Telugu News