Taskin Ahmed: బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ విలవిల... 135 పరుగులకే పరిమితం

Taskin Ahmed Shines as Bangladesh Restricts Pakistan
  • ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాక్‌కు చుక్కలు
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు చేసిన పాకిస్థాన్
  • మూడు వికెట్లతో చెలరేగిన టాస్కిన్ అహ్మద్
  • పాక్ బ్యాటర్లలో మహమ్మద్ హారిస్ టాప్ స్కోరర్
  • స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాకు తొలి ఓవర్‌లోనే షాక్
  • వికెట్ పడగొట్టిన పాక్ పేసర్ షహీన్ అఫ్రిది
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్స్ పోరులో బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కీలక మ్యాచ్‌లో పటిష్టమైన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్‌ను కేవలం 135 పరుగులకే కట్టడి చేశారు. బంగ్లా బౌలర్ల క్రమశిక్షణాయుతమైన బౌలింగ్ ముందు పాక్ బ్యాటర్లు తేలిపోయారు. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆరంభం నుంచే వికెట్లు పడగొట్టారు. పాకిస్థాన్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్‌ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సయీమ్ అయ్యూబ్ (0) కూడా నిరాశపరిచాడు. ఫఖర్ జమాన్ (13), కెప్టెన్ సల్మాన్ అఘా (19) లాంటి కీలక ఆటగాళ్లు సైతం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. పాక్ బ్యాటర్లలో మహమ్మద్ హారిస్ (31) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. చివర్లో మహమ్మద్ నవాజ్ (25), షాహీన్ అఫ్రిది (19) వేగంగా పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగలిగింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో పేసర్ టాస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. స్పిన్నర్లు మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో రెండు వికెట్లు తీసి అతనికి చక్కటి సహకారం అందించారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం 136 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ ఇమొన్‌ను (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు. తాజా సమాచారం అందే సమయానికి బంగ్లాదేశ్ 2.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. సైఫ్ హసన్ (8), తౌహిద్ హృదయ్ (3) క్రీజులో ఉన్నారు.
Taskin Ahmed
Bangladesh vs Pakistan
Asia Cup 2025
Taskin Ahmed bowling
Pakistan batting collapse
Mehedi Hasan
Rishad Hossain
Shahheen Afridi
Dubai International Cricket Stadium

More Telugu News