AU student death: ఏయూలో విద్యార్థి మృతి... వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

AU Student Death Sparks Protests Demanding VC Resignation
  • ఆంధ్ర యూనివర్సిటీలో బీఎడ్ విద్యార్థి మణికంఠ మృతి
  • అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడమే కారణమని తోటి విద్యార్థుల ఆరోపణ
  • వర్సిటీ వైద్య నిర్లక్ష్యంపై విద్యార్థుల తీవ్ర ఆందోళన
  • వీసీ రాజీనామా చేయాలంటూ ప్రధాన గేటు వద్ద నిరసన
  • రాత్రి వరకు కొనసాగిన విద్యార్థుల ఆందోళన, కొవ్వొత్తులతో నివాళి
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని, వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నిరసన కొనసాగించారు.

వివరాల్లోకి వెళితే, బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న విజయమూరి వెంకట సాయి మణికంఠ (25), గురువారం ఉదయం 7:30 గంటల సమయంలో శాతవాహన హాస్టల్ బాత్రూంలో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఎక్కించిన తర్వాత మణికంఠ తనకు ఊపిరి ఆడటం లేదని చెప్పగా, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో లేదని సిబ్బంది చెప్పినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

అనంతరం విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఉదయం 10 గంటల నుంచి ఏయూ ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి, డిస్పెన్సరీని ఆధునీకరించి, వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో విద్యార్థులు రాత్రి వరకు పాల్గొని, మృతుడికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
AU student death
Andhra University
student protest
Visakhapatnam
VC Rajasekhar
SFI
AISF
negligence
medical facilities

More Telugu News