Chandrababu Naidu: సీఎంను 'కుప్పం ఎమ్మెల్యే' అన్న వైసీపీ ఎమ్మెల్సీ... మండలిలో రగడ

AP Council Uproar Over Kuppam MLA Remark on Chandrababu Naidu
  • సీఎం చంద్రబాబును 'కుప్పం ఎమ్మెల్యే' అని పిలిచిన వైసీపీ సభ్యుడు రమేశ్ యాదవ్   
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్సీలు... క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన ఛైర్మన్
  • జగన్‌ను 'పులివెందుల ఎమ్మెల్యే' అనడానికి ప్రతిగా వైసీపీ కౌంటర్
  • ఇకపై మంత్రులను నియోజకవర్గాల పేర్లతోనే పిలుస్తామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గురువారం నాడు తీవ్ర రగడ చెలరేగింది. ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు 'కుప్పం ఎమ్మెల్యే' అని సంబోధించడం సభలో దుమారానికి దారితీసింది. అధికార టీడీపీ సభ్యులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో వాడివేడి వాతావరణం నెలకొంది.

'సూపర్-6' పథకాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిని 'కుప్పం ఎమ్మెల్యే' అని ప్రస్తావించారు. దీంతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా తమ స్థానాల నుంచి లేచి నిరసన తెలిపారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడారని, రమేశ్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. "ముఖ్యమంత్రి సభా నాయకుడు అనే విషయాన్ని వైసీపీ సభ్యుడు ఎలా మర్చిపోతారు?" అని ఆయన ప్రశ్నించారు.

సభ్యుల నిరసనతో జోక్యం చేసుకున్న మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు... రమేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని నిర్ధారించారు. వాటిని సభా రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులందరూ నిబంధనలకు కట్టుబడి, సభా సంప్రదాయాలను గౌరవిస్తూ హుందాగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.

అయితే, ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ నేతలు ప్రతిపక్ష నేత జగన్ ను పదేపదే 'పులివెందుల ఎమ్మెల్యే' అని సంబోధించడంతో, దానికి ప్రతిగానే తాము కూడా ముఖ్యమంత్రిని, మంత్రులను వారి వారి నియోజకవర్గాల పేర్లతో పిలవాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఇకపై చంద్రబాబును 'కుప్పం ఎమ్మెల్యే' అని, లోకేశ్‌ను 'మంగళగిరి ఎమ్మెల్యే' అని, పవన్ కల్యాణ్‌ను 'పిఠాపురం ఎమ్మెల్యే' అని పిలుస్తామని వారు అసెంబ్లీ లాబీ చిట్ చాట్ లో సంభాషణలో చెప్పినట్టు తెలుస్తోంది.

అంతకుముందు చర్చలో, ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే 'సూపర్-6' సూపర్ హిట్ అంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని రమేశ్ యాదవ్ ఆరోపించారు. దీనికి టీడీపీ సభ్యులు బదులిస్తూ, తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుండటం వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ఈ గందరగోళం నడుమ 'సూపర్-6' పై చర్చను ఛైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Legislative Council
Kuppam MLA
YSRCP MLC
Kollu Ravindra
Koyye Moshenu Raju
Super 6 schemes
Telugu Desam Party
Assembly Lobbies

More Telugu News