Vairamuthu: ఎస్పీ బాలుకు తమిళ సినీ కవి వైరముత్తు భావోద్వేగ నివాళి

Vairamuthu Pays Emotional Tribute to SP Balasubrahmanyam
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా వైరముత్తు నివాళి
  • 'ఎక్స్' వేదికగా హృదయానికి హత్తుకునే కవిత పోస్ట్
  • నిన్ను తలవని రోజంటూ లేదంటూ భావోద్వేగం
  • ఎస్పీబీ పాడిన ఐకానిక్ పాటలను స్మరించుకున్న గేయరచయిత
  • ప్రతి పాటలో నీలోని నటుడిని చూపించావంటూ ప్రశంస
  • గాన గంధర్వుడిని గుర్తుచేసుకున్న నటి సిమ్రాన్
గాన గంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ప్రముఖ తమిళ సినీ గీత రచయిత, ఏడుసార్లు జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు హృదయానికి హత్తుకునే రీతిలో నివాళులర్పించారు. ఎస్పీబీని స్మరించుకుంటూ ఆయన సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్ట్ చేసిన కవిత ఇప్పుడు అభిమానుల హృదయాలను ద్రవింపజేస్తోంది.

"ప్రియమైన గాయకుడా! కేవలం వర్ధంతి రోజు మాత్రమే కాదు, నిన్ను తలవని రోజంటూ లేదు. నువ్వు పాడుతుండగా నీతో గడిపిన రోజులే నా జీవితంలో ప్రశాంతమైన క్షణాలు" అంటూ వైరముత్తు తన కవితను భావోద్వేగభరితంగా ప్రారంభించారు. ఎస్పీబీతో తనకున్న అనుబంధాన్ని, ఆయన లేని లోటును ఈ మాటలతో అద్భుతంగా ఆవిష్కరించారు.

తన కవితలో ఎస్పీబీ ఆలపించిన కొన్ని అద్భుతమైన తమిళ గీతాలను ప్రస్తావిస్తూ, వాటికి తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు. 'పొన్మలై పొళుడు' పాటను ఎస్పీబీ గొంతులోని మాయాజాలమని, 'సంగీత జాదిముల్లై' గీతాన్ని కన్నీళ్ల ఉత్సవమని అభివర్ణించారు. మణిరత్నం 'రోజా' చిత్రంలోని 'కాదల్ రోజావే' పాటను ఒక 'కవితాత్మక ప్రేమఘోష' అని పేర్కొన్నారు. అలాగే, 'వన్నం కొండ వెన్నిలవే' పాట ప్రేమలోని అద్వైతమని, 'పనివిళుం మలర్ వనం' గీతం శృంగారభరిత శిల్పమని, 'కాదలే ఎన్ కాదలే' పాట ఓటమికి వేడుక లాంటిదని తన పోస్ట్‌లో వివరించారు.

వైరముత్తు తన కవితను ముగిస్తూ రాసిన వాక్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. "ప్రతి పాటలో నీలో ఉన్న నటుడిని కరిగించి, భావోద్వేగాలను అద్ది పాడావు. నీ రాకతో సినిమా పాటలు పువ్వల్లా వికసించాయి. నీ మరణంతో అవి తెల్లచీర కట్టుకుని నిలబడ్డాయి" అని ఆయన పేర్కొన్నారు. ఈ నివాళిపై నెటిజన్లు, సంగీత ప్రియులు స్పందిస్తూ ఎస్పీబీని గుర్తుచేసుకుంటున్నారు.


Vairamuthu
SP Balasubrahmanyam
SPB
Tamil songs
Kollywood
Indian playback singer
Ponmalai Pozhudu
Kaadhal Rojave
Music composer
Tamil cinema

More Telugu News