Telangana Liquor Shops: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు రేపట్నుంచి దరఖాస్తులు.. రుసుము రూ. 3 లక్షలకు పెంపు

Telangana Liquor Shops Applications Open Soon Fee Increased
  • రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల
  • ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు దుకాణాలు పొందడానికి అనర్హులు
  • అక్టోబర్ 23న కొత్త దుకాణాలకు సంబంధించిన డ్రా
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు మరియు షెడ్యూల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

టెండర్లలో మద్యం దుకాణం దక్కించుకున్న వారికి ఎక్సైజ్ శాఖ రెండేళ్ల కాలానికి కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. ఈ లైసెన్సులు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుమును రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు మద్యం దుకాణాలు పొందడానికి అనర్హులు.

ఎస్సీ, ఎస్టీ, మరియు గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు ఈ నెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు కొత్త దుకాణాల లైసెన్స్‌ల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తారు.

అక్టోబర్ 23న కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ డ్రాలో దుకాణాల లైసెన్స్ పొందినవారు మొదటి దఫా చెల్లింపును అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లించవలసి ఉంటుంది. లైసెన్స్ ఫీజును మొత్తం ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. గతంలో మద్యం దుకాణాల దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలుగా ఉండగా, ఈసారి దానిని రూ. 3 లక్షలకు పెంచారు.
Telangana Liquor Shops
Telangana
Excise Department
Liquor License
Wine Shop Auction
Liquor Shop Reservations

More Telugu News