Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త సౌకర్యాలు

Chandrababu Inaugurates Integrated Command Control Center at Tirumala
  • ఉపరాష్ట్రపతి, సీఎం చేతుల మీదుగా వేంకటాద్రి నిలయం ప్రారంభం
  • భక్తుల కోసం అత్యాధునిక వసతి సముదాయం
  • లడ్డూ నాణ్యతను పర్యవేక్షించేందుకు కొత్త యంత్రం
  • ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు నారా లోకేశ్‌, ఆనం, అనగాని
తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి పలు కీలక అభివృద్ధి పనులను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన 'వేంకటాద్రి నిలయం' యాత్రికుల వసతి సముదాయాన్ని (పీఏసీ-5) ఉపరాష్ట్రపతి, సీఎం లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విజన్ బేస్డ్ స్టోరింగ్ మెషిన్‌కు కూడా శ్రీకారం చుట్టారు. అంతకుముందు, ప్రాంగణానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసిన అనంతరం వారు భవనాన్ని కలియతిరిగి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం, తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను (ఐసీసీసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ ఆయన వెంట ఉన్నారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం రాత్రి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ పద్మావతి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయం తెలిసిందే.

Tirumala
Chandrababu
TTD
Venkatadri Nilayam
Nara Lokesh
Ladoo Prasadam
Integrated Command Control Center
BR Naidu
Anil Kumar Singhal

More Telugu News