Jalagam Praveen: ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురి కిడ్నాప్.. అల్లుడి ఇంటిపై కత్తులతో దాడి.. వీడియో ఇదిగో!

Love Marriage Turns Violent Woman Kidnapped Family Attacked
  • మేడ్చల్ జిల్లా నర్సంపల్లిలో దారుణ ఘటన
  • అల్లుడి ఇంటిపై కత్తులు, కర్రలతో దాడి
  • అడ్డువచ్చిన అల్లుడి తల్లి, సోదరుడి కళ్లల్లో కారం చల్లిన వైనం
  • నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం
  • బాధితుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు
ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువతి తల్లిదండ్రులు, బంధువులు అల్లుడి ఇంటిపై దాడి చేసి, ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బుధవారం కలకలం రేపింది. అడ్డువచ్చిన అల్లుడి తల్లి, సోదరుడిపై కత్తులతో దాడి చేసి, కళ్లల్లో కారం చల్లి బీభత్సం సృష్టించారు.

కీసర మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన జలగం ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన శ్వేత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు మరదలయ్యే శ్వేతను నాలుగు నెలల క్రితం ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం ప్రవీణ్ అనారోగ్యానికి గురికావడంతో భార్య శ్వేతతో కలిసి నర్సంపల్లిలోని తన ఇంటికి వచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఒక్కసారిగా ప్రవీణ్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఉన్న శ్వేతను బయటకు ఈడ్చుకొచ్చారు. ఇది చూసి అడ్డుకోబోయిన ప్రవీణ్ తల్లి, సోదరుల కళ్లల్లో కారం చల్లి, కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం శ్వేత కాళ్లు, చేతులు కట్టేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ప్రవీణ్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమపై దాడి చేసి, శ్వేతను అపహరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. శ్వేత కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించి, శ్వేతను తమకు అప్పగించాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Jalagam Praveen
kidnapping
love marriage
attack
attack
Narsampalli
Keesara
crime news
Andhra Pradesh
Telangana

More Telugu News