Mega DSC: రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి.. నేడు 16 వేల మందికి నియామక పత్రాలు

Chandrababu Distributes Appointment Letters to 16000 Teachers
  • మెగా డీఎస్సీలో ఎంపికైన 15,941 మందికి నియామక ప‌త్రాలు
  • అమరావతిలో ఘనంగా కార్యక్రమం.. హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం
  • కేవలం 150 రోజుల్లోనే రికార్డు వేగంతో డీఎస్సీ ప్రక్రియ పూర్తి
  • ఏప్రిల్ 20న 16,341 పోస్టులకు నోటిఫికేషన్ జారీ
  • ఈ డీఎస్సీలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు
  • పలు జిల్లాల్లో అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 పోస్టులు
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన వేగంతో, కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలు అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి అమరావతిలోని సచివాలయం సమీపంలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ బడుల్లో త్వరలో విధుల్లో చేరనున్న కొత్త ఉపాధ్యాయులతో రాష్ట్రంలో కొలువుల పండుగ వాతావరణం నెలకొంది.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఈ నియామక పత్రాల పంపిణీ జరగనుంది. ముందుగా సబ్జెక్టుల వారీగా రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన 16 మందితో పాటు మొత్తం 22 మందికి వేదికపై పత్రాలు అందజేస్తారు. మిగిలిన అభ్యర్థులకు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అధికారులు నియామక ఉత్తర్వులు ఇస్తారు. 

ఈ కార్యక్రమానికి ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కూడా అనుమతి ఇవ్వడంతో దాదాపు 34 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి, అక్కడే స్థానిక ఎమ్మెల్యేలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 16,341 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఇచ్చి, నార్మలైజేషన్ విధానంలో ఫలితాలు ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 406 పోస్టులు మిగిలిపోయాయి.

సాధారణంగా డీఎస్సీ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. కానీ ఈసారి వందకు పైగా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలైనప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి విద్యాశాఖ కేవలం 150 రోజుల్లోనే ప్రక్రియను ముగించి రికార్డు సృష్టించింది. ఈ డీఎస్సీలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ, హారిజంటల్ రిజర్వేషన్‌ను అమలు చేయడం గమనార్హం. ఎంపికైన వారిలో 50.1 శాతం పురుషులు, 49.9 శాతం మహిళలు ఉన్నారు.
Mega DSC
AP DSC
Chandrababu
Teacher Recruitment
Andhra Pradesh Teachers
Nara Lokesh
Pawan Kalyan
Government Jobs Andhra Pradesh
Education Department AP
AP Government

More Telugu News