CP Radhakrishnan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

CP Radhakrishnan Visits Tirumala Sri Venkateswara Swamy Temple
  • తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
  • తిరుమలలో రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్
  • శేషవాహన సేవలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి, సీఎం దంపతులు
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు.

దేవాలయం లోపలికి వెళ్ళిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు వకుళామాత ఆలయం, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ ప్రధాన గోపురం నుంచి పెద్ద శేషవాహనంపై తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ శేషవాహన సేవలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత తిరుమలకు చేరుకున్నారు. 
CP Radhakrishnan
Vice President of India
Chandrababu Naidu
Tirumala
Tirupati
Sri Venkateswara Temple
AP CM
TTD
Annual Brahmotsavam
Andhra Pradesh

More Telugu News