Chandrababu Naidu: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Offers Silk Clothes to Tirumala Sri Vari
  • తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు లోకేశ్ దంపతులు
  • టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న సీఎం చంద్రబాబు
  •  14 సార్లు పట్టవస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చారన్న సీఎం చంద్రబాబు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ దంపతులతో కలిసి నిన్న రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దాదాపు 5వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఇప్పటి వరకు 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం భగవంతుడు తనకు ఇచ్చారన్నారు. చిన్నప్పటి నుంచీ వేంకటేశ్వర స్వామిని చూస్తూనే పెరిగానని, ఏ కష్టం వచ్చినా ఆయనే ఆదుకున్నారన్నారు. శ్రీవారి దయ వల్లే మనకు శాంతి, సౌభాగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద శేషవాహన సేవలో కూడా పాల్గొన్నారు.

తొలుత తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులకు, మంత్రి లోకేష్ దంపతులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గాయత్రి నిలయం వద్ద టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌లు స్వాగతం పలికారు. 
Chandrababu Naidu
Tirumala
Srivari Brahmotsavam
AP CM
TTD
Nitya Annadanam
Nara Lokesh
Venkateswara Swamy
Hindu Temples

More Telugu News