Elon Musk: ఎలాన్ మస్క్ 'ఎక్స్'కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు

Elon Musks X Faces Setback in Karnataka High Court
  • సమాచారాన్ని బ్లాక్ చేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చే అధికారంపై హైకోర్టులో సవాల్
  • పిటిషన్‌ను కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
  • నియంత్రణ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని వ్యాఖ్య
ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సమాచారాన్ని నిరోధించాలని ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. భారతదేశంలో ఎలాంటి నియంత్రణ లేకుండా మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని కోర్టు స్పష్టం చేసింది. అమెరికా తరహా విధానాలను ఇక్కడ అమలు చేయరాదని వ్యాఖ్యానించింది.

ఐటీ చట్టం, సహ్యోగ్ పోర్టల్ నిబంధనలు తమకు ఉన్న చట్టపరమైన రక్షణలను ఉల్లంఘించేలా ఉన్నాయని, ఇది తమపై అనధికారికంగా సెన్సార్‌షిప్ విధించడమేనని 'ఎక్స్' సంస్థ కేంద్ర ప్రభుత్వంపై నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ)ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.

ఐటీ చట్టం ప్రకారం బ్లాక్ చేసిన కంటెంట్‌ను తొలగించని పక్షంలో, 'ఎక్స్' తన చట్టపరమైన రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద కంటెంట్ బ్లాక్ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని, సెక్షన్ 69ఏను పక్కదారి పట్టించడానికి అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని 'ఎక్స్' పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
Elon Musk
X
Karnataka High Court
India social media
IT Act India
content blocking order

More Telugu News