Nimmala Ramanaidu: కూతురి పెళ్లిలోనూ పసుపు చొక్కా.. మంత్రి నిమ్మల అభిమానం చూశారా!

Nimmala Ramanaidu Wears Yellow Shirt at Daughters Wedding
  • మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహం
  • పెళ్లి వేడుకలోనూ పసుపు చొక్కాతోనే హాజరు
  • కుటుంబ సమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
  • టీడీపీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మంత్రి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
సాధారణంగా పెళ్లిళ్లలో అందరూ పట్టువస్త్రాలు, ఖరీదైన దుస్తులతో మెరిసిపోతారు. కానీ, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం తన కుమార్తె వివాహ వేడుకలోనూ తన ట్రేడ్‌మార్క్ పసుపు రంగు చొక్కాతోనే కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీపై తనకున్న అచంచలమైన అభిమానాన్ని, విధేయతను మరోసారి చాటుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహం సాయి పవన్ కుమార్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంతటి అట్టహాసంగా జరిగిన వేడుకలో బంధుమిత్రులందరూ పట్టువస్త్రాల్లో ధగధగలాడుతుండగా, మంత్రి రామానాయుడు మాత్రం తనదైన శైలిలో పసుపు చొక్కా ధరించి ప్రత్యేకంగా నిలిచారు.

ప్రభుత్వ కార్యక్రమం అయినా, వ్యక్తిగత వేడుకైనా ఆయన పసుపు చొక్కానే ధరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కుమార్తె నిశ్చితార్థంలోనూ ఆయన ఇదే విధంగా కనిపించడంతో ఆ కార్యక్రమానికి హాజరైన నారా లోకేశ్‌ సరదాగా ఆటపట్టించారు. "పెళ్లికొడుకులా తయారవుతారనుకుంటే పసుపు చొక్కాతో కనిపించావేంటి సామీ" అని లోకేశ్‌ వ్యాఖ్యానించగా, "పసుపు శుభసూచకం సార్" అంటూ రామానాయుడు ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.

పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు, పార్టీకి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ పాలకొల్లులో టీడీపీ జెండా ఎగరేసి తన పట్టు నిరూపించుకున్నారు. ఆయన విధేయత, పనితీరును గుర్తించిన చంద్రబాబు, తాజా ప్రభుత్వంలో కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. ఇప్పుడు కుమార్తె పెళ్లిలో కూడా పార్టీ రంగు చొక్కాను వీడకపోవడం తెలుగు తమ్ముళ్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Nimmala Ramanaidu
Andhra Pradesh
Minister Nimmala
Pascima Godavari
Telugu Desam Party
TDP
Palakollu
Chandrababu Naidu
Nara Lokesh
Yellow Shirt

More Telugu News