Germany: అమెరికా కాదు.. మా దేశానికి రండి: భారత నిపుణులకు జర్మనీ రెడ్ కార్పెట్

Germany Offers Red Carpet to Indian Experts Amid US H1B Concerns
  • నైపుణ్యం గల భారతీయులకు జర్మనీ ఆహ్వానం
  • అమెరికా హెచ్-1బీ ఫీజుల పెంపుతో కొత్త అవకాశం
  • జర్మనీలో స్థిరమైన, నమ్మకమైన వలస విధానమంటూ రాయబారి హామీ
  • ఐటీ, సైన్స్ రంగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు
  • జర్మన్ల కంటే భారతీయులకే ఎక్కువ జీతాలు అని వెల్లడి
  • వచ్చే ఏడాది 90,000 వీసాలు భారతీయులకేనని అంచనా
అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ఫీజులను భారీగా పెంచిన నేపథ్యంలో జర్మనీ భారత నిపుణులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ దేశానికి వచ్చి పనిచేయాలంటూ నైపుణ్యం కలిగిన భారతీయులను బహిరంగంగా ఆహ్వానించింది. తమ వలస విధానం అమెరికా లాగా గందరగోళంగా ఉండదని, చాలా స్థిరంగా, నమ్మకంగా ఉంటుందని స్పష్టం చేసింది.

భారత్‌లో జర్మనీ రాయబారిగా వ్యవహరిస్తున్న ఫిలిప్‌ అకెర్‌మన్‌ ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అత్యుత్తమ ప్రతిభావంతులను, కష్టపడి పనిచేసే వారిని జర్మనీ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఐటీ, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత నిపుణులకు అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జర్మనీలో పనిచేస్తున్న కొందరు భారతీయులు స్థానిక జర్మన్ల కంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

తమ దేశ వలస విధానాన్ని జర్మన్ కార్లతో పోలుస్తూ అకెర్‌మన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా ఇమ్మిగ్రేషన్ పాలసీ జర్మన్ కార్ల లాంటిది. చాలా నమ్మకమైన‌ది, ఆధునికమైన‌ది. ఇందులో అమెరికాలో మాదిరిగా ఆకస్మిక మార్పులు, గందరగోళానికి తావుండదు. రాత్రికి రాత్రే విధానాలను ఆపేయడం లాంటివి మా దగ్గర జరగవు" అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతిభావంతులైన భారతీయులు తమ దేశం అందిస్తున్న అవకాశాలను పరిశీలించాలని, తప్పకుండా ఆశ్చర్యపోతారని ఆయన పిలుపునిచ్చారు.

భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం జర్మనీలో సుమారు 2,08,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో జర్మనీ ప్రభుత్వం దాదాపు 2 లక్షల ప్రొఫెషనల్ వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఏకంగా 90,000 వీసాలు భారతీయులకే కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
Germany
Philipp Ackermann
Indian professionals
H-1B visa
IT professionals
Science Technology
German immigration policy
Work in Germany
German Embassy India
Job opportunities Germany

More Telugu News