Asaduddin Owaisi: బీహార్‌లో 'సీమాంచల్ న్యాయ యాత్ర' ప్రారంభించిన అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ కూటమికి ఆఫర్!

Asaduddin Owaisi Starts Seemanchal Nyaya Yatra in Bihar Offers to Congress Alliance
  • యాత్ర ద్వారా ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్
  • మహాఘట్‌బంధన్‌లో చేరడానికి సిద్ధమని తెలిపిన హైదరాబాద్ ఎంపీ
  • కూటమిలో చేరితో తమకు ఆరు సీట్లు ఇవ్వాలని డిమాండ్
మహాఘట్‌బంధన్‌లో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నానని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన 'సీమాంచల్ న్యాయ యాత్ర' ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాఘట్‌బంధన్‌లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు ఆరు సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆయన తన యాత్రను కిషన్‌గంజ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు బీహార్ రాష్ట్ర మజ్లిస్ పార్టీ నేత అఖ్తరుల్ ఇమాన్ ప్రతిపక్ష నాయకుడికి లేఖ రాశారని వెల్లడించారు.

మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా కూడా స్పష్టం చేస్తున్నామని ఆయన అన్నారు. తమకు ఆరు సీట్లు కేటాయించాలని అఖ్తరుల్ కోరారని తెలిపారు.

ఇప్పుడు నిర్ణయం మహాఘట్‌బంధన్‌ చేతిలోనే ఉందని అసదుద్దీన్ అన్నారు. తమ ప్రతిపాదనను వారు అంగీకరించని పక్షంలో బీజేపీని ఎవరు గెలిపించాలనుకుంటున్నరో ప్రజలకు అవగతమవుతుందని అభిప్రాయపడ్డారు. అంతిమ నిర్ణయం బీహార్ ప్రజలదేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో తమను ఎవరూ నిందించకుండా, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష కూటమితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.
Asaduddin Owaisi
Bihar
Seemanchal Nyaya Yatra
AIMIM
Mahagathbandhan
Tejashwi Yadav
Bihar Assembly Elections

More Telugu News