Bangkok: బ్యాంకాక్ రద్దీగా ఉండే రహదారిపై ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భారీ గుంతతో పరుగు తీసిన జనం.. ఇదిగో వీడియో

Bangkok Road Collapses Suddenly Creating Huge Sinkhole
  • రహదారి కుంగిపోవడంతో నిలిచిన ట్రాఫిక్
  • 30 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతున కుంగిన రోడ్డు
  • భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం కారణంగా కుంగిపోయినట్లుగా అంచనా
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రద్దీగా ఉండే రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. ఆకస్మికంగా భారీ గుంత ఏర్పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సుమారు 30 మీటర్ల పొడవు, 15 మీటర్ల లోతు మేర రహదారి కుంగిపోయింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు గుంతలో పడిపోయాయి, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కళ్లముందే రహదారి కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

బ్యాంకాక్ గవర్నర్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ భారీ గుంత కారణంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. భూగర్భ రైలు స్టేషన్ నిర్మాణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

రహదారిపై హఠాత్తుగా ఏర్పడిన భారీ గుంతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రహదారి నెమ్మదిగా కుంగిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. గుంతకు దగ్గరగా వచ్చిన కార్లు, ఇతర వాహనాలు వెనక్కి వెళ్లినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది.
Bangkok
Bangkok road collapse
Thailand
Road collapse
Sinkhole
Traffic disruption
Underground train station

More Telugu News