Telangana Rains: తెలంగాణలో ఈ నెల 30 వరకు వర్షాలు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

Telangana Rains Heavy Rains Expected Till 30th in Telangana
  • వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం
  • మంచిర్యాల, నిర్మల్, వరంగల్, జనగాం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనాల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం రాగల 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది.

గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains
Telangana weather
Hyderabad weather
IMD Hyderabad
Heavy Rainfall alert
Telangana districts rainfall

More Telugu News