Nara Lokesh: చిత్తూరులో కొత్త వర్సిటీ.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్‌ హామీ

Nara Lokesh Assures New University for Chittoor in Assembly
  • చిత్తూరులో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు పరిశీలనలో ఉంద‌న్న మంత్రి
  • ఎమ్మెల్యే జగన్మోహన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ సానుకూల నిర్ణయం
  • తునిలో హైస్కూల్‍ను కాలేజీగా మార్చాలని కోరిన ఎమ్మెల్యే దివ్య 
  • మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యమ‌న్న లోకేశ్‌
  • గత ప్రభుత్వంలో జూనియర్ కళాశాలలు నిర్వీర్యమయ్యాయని ఆరోపణ
చిత్తూరు జిల్లాలో నూతనంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

గతేడాది నవంబరులోనే ఈ విషయంపై ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా విభజన అనంతరం, ప్రస్తుతం జిల్లా పరిధిలో ప్రభుత్వ రంగంలో ద్రవిడియన్ విశ్వవిద్యాలయం, ప్రైవేటు రంగంలో అపోలో విశ్వవిద్యాలయం ఉన్నాయని తెలిపారు. అయితే, ప్రతి జిల్లాలోనూ కచ్చితంగా ఒక ప్రభుత్వ లేదా ప్రైవేటు వర్సిటీ ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అని లోకేశ్ పేర్కొన్నారు. ద్రవిడియన్ వర్సిటీ కేవలం భాషా పరమైనది కావడంతో అందరం కలిసికట్టుగా పనిచేసి చిత్తూరులో మరో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అదే సమయంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య తన నియోజకవర్గంలోని తొండంగి మండలం, రావికంపాడులో ఉన్న ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‍గ్రేడ్ చేయాలని సభలో కోరారు. దీనిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'హైస్కూల్ ప్లస్' విధానం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిర్వీర్యమయ్యాయని లోకేశ్‌ ఆరోపించారు. ఈ విధానంతో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని ప్రక్షాళన చేసిందని, ఫలితంగా ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు 40 శాతం పెరిగాయని వివరించారు.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా అందిస్తున్నామని తెలిపారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే రెండేళ్లలో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. తుని ఎమ్మెల్యే విజ్ఞప్తిపై పూర్తి వివరాలు తెప్పించుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన సభకు హామీ ఇచ్చారు.
Nara Lokesh
Chittoor University
Andhra Pradesh
AP Assembly
Jaganmohan Rao
Yanamala Divya
Higher Education
Tuni Constituency
Education Policy
Chandrababu Naidu

More Telugu News