Mutteboina Sandeep: పెంపుడు కుక్క గీరడంతో రేబిస్.. యువకుడి మృతి

Dog nail scratch leads to youth death in Bhadradri Kothagudem
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన విషాద ఘటన
  • చిన్న గాయమేనని నిర్లక్ష్యం చేయడంతో పోయిన ప్రాణం
  • కుక్క కరిచిందని తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడు
  • తన గాయాన్ని పట్టించుకోకపోవడంతో విషాదం
  • రెండు నెలల తర్వాత బయటపడిన రేబిస్ లక్షణాలు
చిన్న గాయమే కదా అని చేసిన నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. అందంగా ఉందని పెంచుకున్న కుక్కపిల్ల గోరు గీరుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన ముత్తెబోయిన సందీప్ (25)  రెండు నెలల క్రితం వీధిలో కనిపించిన ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఆ కుక్కపిల్ల సందీప్ తండ్రి పున్నయ్యను కరిచింది. అదే సమయంలో సందీప్ కాలికి కూడా దాని గోరు బలంగా గీసుకుంది.

వెంటనే స్పందించిన సందీప్ తన తండ్రిని పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అయితే, తన కాలికి తగిలిన గాయాన్ని మాత్రం తేలికగా తీసుకున్నాడు. కేవలం గోరు గీసుకుంది కదా అని భావించి ఎలాంటి వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్న అతడికి రెండు నెలల తర్వాత రేబిస్ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైంది.

కొన్ని రోజుల్లోనే వ్యాధి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు అతడిని మణుగూరు, భద్రాచలం ఆసుపత్రులకు తరలించారు. కానీ, అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్స ఫలించలేదు. సోమవారం రాత్రి సందీప్ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్కపిల్లే తమ కుమారుడి ప్రాణాలు తీయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Mutteboina Sandeep
dog bite
rabies
Bhadradri Kothagudem
Pinapaka
Andhra Pradesh news
dog nail scratch
street dog
rabies symptoms

More Telugu News