H1B Visa: హెచ్ 1-బీ వీసా లాటరీ విధానంలో మార్పులకు ప్రతిపాదనలు

H1B Visa Lottery System Changes Proposed
  • హెచ్ 1 బీ వీసా దరఖాస్తు ఎంపికలో డీహెచ్ఎస్ కొత్త నిబంధనలు
  • ఇకపై అధిక నైపుణ్యం, ఎక్కువ వేతనాలు పొందే విదేశీ నిపుణులకు ప్రాధాన్యం
  • తాజా మార్పులు 2026 ఆర్ధిక సంవత్సరం నుంచి అమలులోకి..
అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా ఎంపిక లాటరీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే హెచ్‌-1బీ వీసా రుసుములను భారీగా పెంచిన ట్రంప్ ప్రభుత్వం, వీసా ఎంపికలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం, వీసా దరఖాస్తుల ఎంపికలో ప్రస్తుత లాటరీ విధానానికి స్వస్తి పలికి, అధిక నైపుణ్యం కలిగి, ఎక్కువ వేతనం పొందే విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగుల వేతన స్థాయిని ఆధారంగా దరఖాస్తులను వర్గీకరించడం, వేతన వర్గీకరణ (ఒకటి నుంచి నాలుగు), అలాగే అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ మార్పులు 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని డీహెచ్‌ఎస్ భావిస్తోంది.

డీహెచ్‌ఎస్ అంచనాల మేరకు.. ఈ మార్పుల వల్ల హెచ్‌-1బీ వీసాదారులకు చెల్లించే వేతనాల మొత్తం 2026 ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్ డాలర్ల నుంచి 2029లో 2 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

ఈ నిర్ణయాలు వీసా విధానాలను మరింత కఠినతరం చేస్తాయని, స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదనలపై వివిధ వాణిజ్య, వీసా రంగాల నిపుణులు స్పందిస్తున్నారు. 
H1B Visa
USCIS
H 1B Visa Lottery
Department of Homeland Security
skilled workers
foreign professionals
US immigration
visa fees
wage levels
American employees

More Telugu News