Yu Faxin: చైనాలో అగ్రశ్రేణి డిఫెన్స్ సైంటిస్ట్ అరెస్టు.. ఎందుకంటే?

Yu Faxin Top Chinese Defense Scientist Arrested
  • యూ ఫాక్సిన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపిన ఆయన కంపెనీ
  • తాత్కాలికంగా ఆయన విధులకు అందుబాటులో ఉండరని ప్రకటన
  • అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి అవినీతి నియంత్రణ కోసం జిన్‌పింగ్ చర్యలు
ఆయుధ వ్యవస్థల కోసం సెమీకండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేయడంలో ప్రత్యేకత కలిగిన ఒక అగ్రశ్రేణి చైనా శాస్త్రవేత్తను ఆ దేశ అవినీతి నిరోధక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో కొంతకాలంగా కీలక వ్యక్తుల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా అత్యున్నత శాస్త్రవేత్త యూ ఫాక్సిన్‌ను అరెస్టు చేసినట్లు ఆయనకు చెందిన కంపెనీ ఝీజియాంగ్ గ్రేట్ మైక్రోవేవ్ టెక్నాలజీ తెలిపింది.

సెప్టెంబర్ 21న తమ కంపెనీ ఛైర్మన్ యూ ఫాక్సిన్‌ను హువాంగ్షి సూపర్‌వైజరీ కమిషన్ అదుపులోకి తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. హాంగ్జౌలోని ఝేఝీయాంగ్ విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్‌లో యూ ఫాక్సిన్ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు.

మీడియా కథనాల ప్రకారం, ఆయన మైక్రోవేవ్ అండ్ మిల్లీమీటర్ వేవ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీలో నిపుణుడు. కమ్యూనికేషన్, నావిగేషన్, రాడార్ టెక్నాలజీలో ఆయన పరిశోధనలు చేశారు. గాలియం నైట్రైడ్, గాలియం ఆర్సెనైడ్ సమ్మేళనాలతో సహా సెమీకండక్టర్ పదార్థాల కోసం ప్రాసెస్ టెక్నాలజీపై కూడా ఆయన పనిచేస్తున్నారు. తాత్కాలికంగా ఆయన విధులకు అందుబాటులో ఉండరని ఆ సంస్థ ప్రకటించింది.

కాగా, ఝీజియాంగ్ సంస్థ కమ్యూనికేషన్లు, ఉపగ్రహ సర్క్యూట్లు, రాడార్లు వంటి వాటిని తయారు చేస్తుంది. దీని చిప్స్‌ను చైనా సైన్యం విస్తృతంగా వినియోగిస్తోంది. 2012లో చైనా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి జిన్‌పింగ్ వరుసగా అవినీతిపై నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులు, సీనియర్ జనరల్స్‌ను అరెస్టు చేయించారు.
Yu Faxin
China
Chinese scientist
arrest
corruption
defense technology
semiconductor chips

More Telugu News