Shreyas Iyer: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో టెస్టుకు కొన్ని గంటల ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer Steps Down As Captain Before Australia A Test
  • ఆస్ట్రేలియా- ఏతో రెండో టెస్టుకు ముందు ఇండియా 'ఏ'కు ఎదురుదెబ్బ
  • కెప్టెన్సీ నుంచి ఆకస్మికంగా తప్పుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్
  • వ్యక్తిగత కారణాలతో ముంబైకి శ్రేయాస్
  • ఇండియా- ఏ కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన ధ్రువ్ జురెల్
లక్నో వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న రెండో అనధికారిక టెస్టుకు కేవలం కొన్ని గంటల ముందు ఇండియా-ఏ  జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్, స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆకస్మికంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆడలేకపోతున్నానని జట్టు యాజమాన్యానికి తెలిపి, ముంబైకి తిరిగి వెళ్లినట్లు సమాచారం. ఈ ఊహించని మార్పుతో మొదటి టెస్టులో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నప్పటికీ, అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు స్పష్టం చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇటీవల రెడ్ బాల్ క్రికెట్‌లో అయ్యర్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ఆస్ట్రేలియా-ఏ తో జరిగిన మొదటి టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన శ్రేయాస్, అంతకుముందు దులీప్ ట్రోఫీలోనూ పెద్దగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విరామం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొదటి అనధికారిక టెస్టులో దేవదత్ పడిక్కల్ (150)తో కలిసి జురెల్ (140) అద్భుత శతకంతో రాణించాడు. వీరిద్దరి ప్రదర్శనతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఇక జట్టులోనూ కొన్ని మార్పులు చేశారు. పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో సీనియర్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మోకాలి గాయంతో బాధపడుతున్న యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఇంకా విశ్రాంతినిచ్చారు. సీనియర్ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న పలువురు ఆటగాళ్లకు ఈ సిరీస్ కీలకం కావడంతో రెండో టెస్టుపై అందరి దృష్టి నెలకొంది.
Shreyas Iyer
India A
Australia A
Dhruv Jurel
Test Series
Cricket
BCCI
Mohammed Siraj
Devdutt Padikkal
Lucknow

More Telugu News