Vaikuntam Jyothi: వైకుంఠం జ్యోతి చేతికి ఆలూరు టీడీపీ పగ్గాలు

Vaikuntam Jyothi Appointed Aluru TDP Incharge
  • జ్యోతి నియామకంపై అధికారికంగా ప్రకటించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
  • వైకుంఠం కుటుంబానికి పార్టీతో పాత బంధం
  • వర్గ విభేదాలే ఇన్‌చార్జి మార్పుకు కారణం
చివరకు కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మార్పు జరిగింది. పార్టీ ఇన్‌ఛార్జి అంశంలో గత నాలుగు నెలలుగా నెలకొన్న వివాదానికి పార్టీ అధిష్ఠానం తెరదించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు కొనసాగిన వీరభద్రగౌడ్‌ను తప్పించి, ఆయన స్థానంలో వైకుంఠం జ్యోతిని పార్టీ నియమించింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి, మాజీ ఎంపీపీ వైకుంఠం ప్రసాద్‌ అర్ధాంగి జ్యోతి కొత్తగా ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టనున్నారు.

వైకుంఠం కుటుంబానికి పార్టీతో పాత బంధం

వైకుంఠం కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తోంది. జ్యోతి మామ శ్రీరాములు గతంలో ఇన్‌ఛార్జిగా, భర్త శివప్రసాద్ 2009–2014 మధ్య ఇన్‌ఛార్జిగా పనిచేశారు. 2014లో జ్యోతి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, రాకపోవడంతో పార్టీకి వైకుంఠం కుటుంబం కాస్త దూరంగా ఉండిపోయింది. అయినా 2019లో కోట్ల సుజాతమ్మ తరఫున ప్రచారం చేసి పార్టీలో చురుకుగా పాల్గొన్నారు.

వర్గవిభేదాలే ఇన్‌ఛార్జి మార్పుకు కారణం

వీరభద్రగౌడ్‌ను పదవి నుంచి తప్పించే పరిస్థితి తెచ్చింది వర్గవిభేదాలు, ఒంటెత్తు పోకడలేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ‘‘వైకుంఠం వర్గాన్ని కలుపుకోవడంలో వీరభద్రగౌడ్‌ విఫలమయ్యారు. అనేక అవకాశాలు ఇచ్చినా మార్పు లేకపోవడంతో అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది’’ అని పార్టీ నేతలు చెబుతున్నారు.

జ్యోతిని ఇన్‌ఛార్జిగా ఆహ్వానించిన కార్యకర్తలు

వైకుంఠం జ్యోతిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో ఆలూరు టీడీపీ శ్రేణులు, వైకుంఠం వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో కార్యకర్తలు బాణసంచాలు కాల్చి, కేక్‌లు కట్‌ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

“అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరినీ కలుపుకొని పనిచేస్తాను. పార్టీ బలోపేతమే నా లక్ష్యం” అని వైకుంఠం జ్యోతి స్పష్టం చేశారు.

వీరభద్రగౌడ్ 2014, ఆ తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వీరభద్ర గౌడ్ ఓటమి పాలైన తర్వాత పార్టీ కార్యక్రమాల నిర్వహణకు జిల్లా ఇన్ చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ కడప రీజియన్ చైర్మన్ పూల నాగరాజులతో త్రిసభ్య కమిటీని అధిష్ఠానం నియమించింది.

త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో వీరభద్రగౌడ్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇన్‌ఛార్జి పదవి నుంచి వీరభద్రగౌడ్‌ను తొలగిస్తున్నట్లు ఆలూరులో జిల్లాపార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు. మూడు నెలల తర్వాత వైకుంఠం జ్యోతిని ఇన్‌ఛార్జిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.  
Vaikuntam Jyothi
Aluru
TDP
Telugu Desam Party
Kurnool district
Veerabhadra Goud
Palla Srinivas
Andhra Pradesh Politics
Kotla Sujathamma
Nimalla Ramanayudu

More Telugu News