Nara Lokesh: దసరా అంటే బెజవాడే.. మైసూరును మించిపోయేలా 'విజయవాడ ఉత్సవ్': మంత్రి లోకేశ్‌

Nara Lokesh Launches Vijayawada Utsav with Grandeur
  • పున్నమి ఘాట్‌లో ఘనంగా ప్రారంభమైన 'విజయవాడ ఉత్సవ్'
  • వెంకయ్యనాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌
  • దసరా వేడుకలంటే మైసూరు కాదు, విజయవాడ గుర్తుకురావాలన్నదే లక్ష్యమ‌న్న మంత్రి
  • 11 రోజుల పాటు ఐదు వేదికలపై 250కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు
  • మన సంస్కృతి, కళలను భావి తరాలకు అందించేందుకే ఈ ఉత్సవాలన్న లోకేశ్‌
  • ఎంపీ కేశినేని చిన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ లోకేశ్‌ ప్రశంస
దసరా ఉత్సవాలంటే ఇప్పటివరకు మైసూరు పేరే వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో విజయవాడ పేరు మారుమోగేలా ‘విజయవాడ ఉత్సవ్’ను అద్భుతంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. మన సంస్కృతి, చరిత్ర, కళలను నేటి తరానికి పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ వేడుకలను చేపట్టామని ఆయన తెలిపారు. సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్‌లో ఏర్పాటు చేసిన 'విజయవాడ ఉత్సవ్' ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, దుర్గమ్మ, కృష్ణమ్మ కొలువైన పుణ్యభూమి విజయవాడ అని, ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయమేనని అన్నారు. "రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవ్ ఒక గొప్ప వేదికగా నిలవనుంది. సుమారు 3000 మంది కళాకారులు, 30కి పైగా కళారూపాలతో నిర్వహించే కార్నివాల్ చరిత్రాత్మకం కానుంది," అని ఆయన వివరించారు. 11 రోజుల పాటు ఐదు ప్రధాన వేదికలపై 250కి పైగా కార్యక్రమాలు, 600 స్టాల్స్‌తో కూడిన ఎక్స్‌పో, హెలికాప్టర్ రైడ్స్, పారామోటరింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై లోకేశ్‌ ప్రశంసలు కురిపించారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయన పట్టుదల అందరికీ ఆదర్శమని కొనియాడారు. తెలుగు భాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి వల్లే ప్రభుత్వ జీవోలు తెలుగులో వస్తున్నాయని గుర్తుచేశారు. "వెంకయ్యనాయుడు గారు గంట సేపు మాట్లాడినా బోర్ కొట్టదు. ఆయన వేగం చూస్తే ఇప్పటికీ నాకు అసూయ కలుగుతుంది" అని లోకేశ్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ ఉత్సవాలను కేవలం ఒక్కసారికే పరిమితం చేయకుండా, ప్రతి ఏటా నిర్వహిస్తూ విజయవాడను ఒక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులను కోరారు. ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్)ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌, వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పాల్గొన్నారు. అంతకుముందు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు.

Nara Lokesh
Vijayawada Utsav
Dasara celebrations
Venkiah Naidu
Keshineni Srinivas
Andhra Pradesh culture
Vijayawada tourism
Telugu language
Kolli Ravindra
tourism

More Telugu News