Chandrababu Naidu: వాహనాల విక్రయంలో వరుణ్ గ్రూప్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Praises Varun Group Growth in Vehicle Sales
  • ఆటోమొబైల్ రంగానికి ఊతం జీఎస్టీ సంస్కరణలు ఊతమన్న సీఎం చంద్రబాబు 
  • డైమండ్ జూబ్లీ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
  • వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
  • ప్రభు కిశోర్ జీవిత చరిత్ర ‘The Winnarian’ బుక్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
జీఎస్టీ సంస్కరణలు ఆటోమొబైల్ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ వేడుకలు విజయవాడలో జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. వరుణ్ గ్రూప్ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ అధినేత ప్రభు కిశోర్ జీవిత చరిత్ర ‘The Winnarian’ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగంతో సహా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. ఏపీ నుంచే పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఎగుమతి చేసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆటోమొబైల్ రంగంలో వరుణ్ గ్రూప్ ఎంతో ప్రగతి సాధించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ సంస్కరణలు ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి తోడ్పడతాయి. కొన్ని సంస్థలు మొదటి జనరేషన్‌లో, మరికొన్ని రెండో జనరేషన్‌లో దెబ్బతిన్నాయి. చాలా తక్కువ సంస్థలే దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగాయి. అలాంటి వాటిలో ఒకటి వరుణ్ గ్రూప్. నేటి పోటీ ప్రపంచంలో ఒక సంస్థ 75 ఏళ్ల ప్రస్థానమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ ఘనత సాధించిన వరుణ్ గ్రూప్‌ను అభినందిస్తున్నాను" అని అన్నారు.

కృష్ణా జిల్లా వాసులు తెలివైనవారు

"75 ఏళ్ల క్రితం వరుణ్ గ్రూప్ ఇదే విజయవాడ నుంచి విజయయాత్ర మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం వాళ్లు అత్యంత తెలివైన వాళ్లు, సమర్థులు. కృష్ణా జిల్లా వాసులు దేశ, విదేశాల్లో వ్యాపార, వాణిజ్య, విద్యా, సినీ రంగాల్లో అద్భుతంగా రాణించారు. ఇప్పుడు అమరావతి రాజధాని అయింది కాబట్టి విదేశాలు వెళ్లిన ఈ జిల్లా వాసులు మళ్లీ వస్తారు. విశాఖ, విజయవాడల్లో అత్యుత్తమ హోటల్ కట్టిన ప్రభుకిషోర్ అమరావతిలో కూడా నోవాటెల్ హోటల్‌కు శంకుస్థాపన చేయడం శుభ పరిణామం. వేలాది మంది యువతకు వరుణ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు" అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పలువురు పారిశ్రామికవేత్తలు, వరుణ్ గ్రూప్ సిబ్బంది హాజరయ్యారు. 

Chandrababu Naidu
Varun Group
Andhra Pradesh
Automobile Industry
GST Reforms
Vijayawada
Prabhu Kishore
AP Development
Green Hydrogen Valley
Krishna District

More Telugu News