Nara Lokesh: జగన్‌ ఎక్కడికైనా వెళ్లొచ్చు.. గృహ నిర్బంధం చేయం.. కానీ ఒకే కండిషన్: లోకేశ్

Lokesh Warns Jagan Against Disturbing Peace in AP
  • శాసనసభకు జగన్ ఎందుకు రావడం లేదని లోకేశ్ ప్రశ్న
  • పులివెందుల సమస్యలైనా సభలో ప్రస్తావించాలి కదా అని విమర్శ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
శాసనసభ సమావేశాలకు హాజరుకావడం వైసీపీ అధినేత జగన్ బాధ్యత కాదా అని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ సూటిగా ప్రశ్నించారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచన ఆయనకు లేదా అని నిలదీశారు. వైసీపీ ఎప్పుడూ కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తుందని, ఆ పార్టీ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

జగన్‌ ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చని, ప్రభుత్వం ఎలాంటి గృహ నిర్బంధాలు విధించబోదని లోకేశ్‌ స్పష్టం చేశారు. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూసినా, పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నాలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం మొత్తం కీలక సమావేశాలతో తీరిక లేకుండా ఉన్నారని, ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా తిరగవద్దని చెప్పినా ఆయన ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని లోకేశ్‌ తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి నాటికి ఏపీలో క్వాంటం కంప్యూటర్‌ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. అక్టోబర్‌ నుంచి రాష్ట్రానికి వరుసగా పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నిర్విరామంగా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా రాష్ట్రాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.

జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌లో భారీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవ్‌’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ కార్యక్రమాలను అక్టోబర్‌ 19 నాటికి పూర్తి చేస్తామని లోకేశ్‌ పేర్కొన్నారు.

Nara Lokesh
Jagan
Andhra Pradesh
AP Assembly
GST
Investments AP
Quantum Computer
Pulivendula
Chandrababu Naidu
Job Creation

More Telugu News