Kavitha: అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతి తేల్చండి: ప్రభుత్వానికి కవిత సవాల్

Kavitha Challenges Government to Demolish Arikepudi Gandhis Encroached Land
  • గాజులరామారంలో పేదల ఇళ్ల కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం
  • మళ్లీ బుల్డోజర్ వస్తే అడ్డుగా నిలబడతానని హెచ్చరిక
  • బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 50 వేల సాయం డిమాండ్
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కబ్జా చేశారంటున్న 12 ఎకరాల భూమి సంగతి ఏంటని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గాజులరామారంలో హెచ్ఎండీఏ చేపట్టిన కూల్చివేతల బాధితులను పరామర్శించిన ఆమె, ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

గాజులరామారంలో పర్యటించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. కూలిపని చేసుకుని బతికే పేదల ఇళ్లను కూల్చడంలో హీరోయిజం ఏముందని హెచ్ఎండీఏ అధికారులను నిలదీశారు. "పెద్దవాళ్లు చేసిన ఎకరాల కొద్దీ కబ్జాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? ముందు అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల సంగతి తేల్చండి" అని ఆమె డిమాండ్ చేశారు. పండుగ సమయంలో పేదల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆదివారం రోజున ఇళ్లు కూల్చడం అమానుషమని మండిపడ్డారు.

కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని, తక్షణ సాయంగా రూ. 50 వేలు అందించాలని కవిత డిమాండ్ చేశారు. వచ్చే నెల 6వ తేదీలోగా బాధితులకు న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. "మళ్లీ ఇక్కడికి బుల్డోజర్ వస్తే, దానికి అడ్డుగా నిలబడే మొదటి వ్యక్తిని నేనే అవుతా" అని ఆమె హెచ్చరించారు. వెంచర్లు వేసి అమ్మిన వారి నుంచి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఆయన తన గడీ దాటి రావడం లేదని కవిత విమర్శించారు. ప్రజా పాలన అంటూనే ప్రజల గోడు వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి రాష్ట్రంలో ఉందని దుయ్యబట్టారు. బాధితుల వివరాలు తానే స్వయంగా సేకరించి, ప్రభుత్వ కార్యాలయానికి వస్తానని, ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారినా పోచమ్మ బస్తీ పరిసరాల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడలేకపోయారని, ఇప్పుడు హడావుడిగా వచ్చి పేదలపై ప్రతాపం చూపడం దారుణమని అన్నారు.

Kavitha
Kalvakuntla Kavitha
Arikepudi Gandhi
Telangana Jagruthi
Serilingampally MLA
Land Grabbing
HMDA
Demolition
Gajularamaram
Double Bedroom Houses

More Telugu News