KTR: ఇకపై ఇది తెలంగాణ భవన్ కాదు.. ‘జనతా గ్యారేజ్’: కేటీఆర్

KTR Declares Telangana Bhavan as Janata Garage for Public Grievances
  • ఆర్ఆర్ఆర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేటీఆర్ హామీ
  • సమస్యల పరిష్కారానికి తెలంగాణ భవన్‌లో న్యాయవాదుల సాయం
  • అలైన్‌మెంట్లు మార్చడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, ప్రజల సమస్యలు పరిష్కరించే ‘జనతా గ్యారేజ్’ అని ఆయన ప్రకటించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి రావచ్చని, న్యాయ సహాయం కోసం నిపుణులైన న్యాయవాదులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్‌మెంట్ వల్ల నష్టపోతున్న రైతులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులతో తామే స్వయంగా రోజుల తరబడి చర్చలు జరిపి, మెరుగైన పరిహారం, ఇళ్లు ఇచ్చి ఒప్పించామని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లడానికే ముఖం చాటేస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే అలైన్‌మెంట్లు మార్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని కేటీఆర్ విమర్శించారు. అలైన్‌మెంట్లు మార్చి పేదల జీవితాలతో ఆడుకోవడం కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని అన్నారు. ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను శాస్త్రీయంగా ఖరారు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పోరాటంలో రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని ఆయన రైతులకు సూచించారు. అలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సమస్యను పరిష్కరిస్తాయని తెలిపారు.
KTR
K Taraka Rama Rao
Telangana Bhavan
BRS
Regional Ring Road
RRR
Farmers
Compensation
Congress Government
Land Acquisition

More Telugu News