Nara Lokesh: పరకామణిపై సిట్‌.. జగన్‌ నాటకాలకు దేవుడే శిక్ష వేశాడు: లోకేశ్‌

Nara Lokesh SIT Probe into TTD Parakamani Irregularities
  • టీటీడీ పరకామణి అక్రమాలపై సిట్ వేస్తున్నామన్న లోకేశ్
  • వైసీపీ హయాంలో కేసును నీరుగార్చారని విమర్శ
  • 106 కేసులను ఎదుర్కొని మెగా డీఎస్సీ విజయవంతం చేశామని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి విభాగంలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును నీరుగార్చారని, అసలైన దొంగను అరెస్ట్ చేయకుండా కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారని ఆయన ఆరోపించారు. 

ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన లోకేశ్‌.. జగన్‌ బృందం దేవుడి దగ్గర నాటకాలు ఆడటం వల్లే, ఆ దేవుడే వారికి తగిన శిక్ష వేశాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందని, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వం ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే, వాటిని ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ జగన్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. సామాన్యులకు వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకే వైద్య కళాశాలలు, విమానాశ్రయాలు, రోడ్ల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నామని వివరించారు. 

అధికారంలో ఉన్నప్పుడు ఏ పనీ చేయని జగన్‌, ఇప్పుడు తాము చేస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. తన అనుచరులకు ఇచ్చిన కాంట్రాక్టులు చేజారిపోతున్నాయనే కడుపుమంటతోనే జగన్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

అక్టోబరు నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ స్పష్టం చేశారు. జనవరి నాటికి క్వాంటమ్‌ కంప్యూటర్‌ అందుబాటులోకి వస్తుందని, తాత్కాలికంగా దాని కార్యకలాపాలను విట్‌ యూనివర్సిటీ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. 
Nara Lokesh
Tirumala Tirupati Devasthanam
TTD
Parakamani
Jagan Mohan Reddy
Mega DSC
AP Politics
PPP Model
Andhra Pradesh
Investments

More Telugu News