Nara Lokesh: ప్రభుత్వ బడుల ముందు 'నో అడ్మిషన్స్' బోర్డులే నా లక్ష్యం: మంత్రి లోకేశ్

Nara Lokesh Aims for No Admissions Boards at Government Schools
  • ప్రాథమిక విద్యకు నష్టం కలిగించిన జీఓ 117, 85లను రద్దు చేశామ‌న్న మంత్రి 
  • 'ప్రతి తరగతికి ఒక టీచర్' విధానం అమలుకు కొత్త జీఓలు తెచ్చామ‌ని వెల్ల‌డి
  • 'మన బడి - మన భవిష్యత్తు'తో మౌలిక వసతుల కల్పన అన్న లోకేశ్‌
  • బడి దూరంగా ఉంటే విద్యార్థులకు నెలకు రూ.600 రవాణా భత్యం ఇస్తున్నామ‌న్న మంత్రి
  • ఈ ఏడాది ఇప్పటికే 100 పాఠశాలల్లో పూర్తిస్థాయి అడ్మిషన్లు జ‌రిగాయ‌ని వ్యాఖ్య‌
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు 'నో అడ్మిషన్స్' బోర్డును చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఏడాది 100 పాఠశాలల్లో ఈ పరిస్థితిని సాధించామని, త్వరలోనే రాష్ట్రంలోని 42 వేల ప్రభుత్వ బడులను అదే స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం శాసనసభలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.117, 85లను ఈ ఏడాది మే 13న రద్దు చేసినట్లు లోకేశ్ తెలిపారు. ఈ జీవోలు ప్రాథమిక విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారాయని, దీనివల్ల సుమారు 10 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని ఆయన అన్నారు. తన పాదయాత్ర సమయంలో పలువురు ఉపాధ్యాయులు ఈ జీవోను రద్దు చేయాలని కోరారని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్నతాధికారులతో 33 సమావేశాలు నిర్వహించి, ఆ జీవోలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త జీవోలు 19, 20, 21 తీసుకొచ్చామని వివరించారు.

కొత్త విధానం ప్రకారం, 'ప్రతి తరగతికి ఒక టీచర్' ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకముందు కేవలం 1398 పాఠశాలల్లో ఈ విధానం అమల్లో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 9620కి పెంచామని చెప్పారు. అదేవిధంగా, గతంలో 124గా ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్లను 729కి అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం 'మన బడి – మన భవిష్యత్తు' కార్యక్రమాన్ని ప్రారంభించామని లోకేశ్ తెలిపారు. దాతల నుంచి పారదర్శకంగా నిధులు సేకరించి, పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. బడులకు ఇప్పటికే స్టార్ రేటింగ్ విధానం ప్రవేశపెట్టామని, వాటిని మెరుగుపరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యులపై ఉందని సూచించారు.

దీంతో పాటు, నివాసానికి కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో పాఠశాల ఉన్న విద్యార్థులకు రవాణా ఖర్చుల కింద నెలకు రూ.600 చొప్పున పది నెలల పాటు అందిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది సుమారు 70 వేల మంది విద్యార్థులకు ఈ ప్రయోజనం అందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు పాఠశాలలను మించి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.
Nara Lokesh
government schools
AP education
school admissions
education reforms
Chadalawada Aravind Babu
Mana Badi Mana Bhavishyathu
AP schools
education system
school infrastructure

More Telugu News