Nara Lokesh: అమరావతిలో ప్రపంచస్థాయి స్టేట్ లైబ్రరీ.. గ్రంథాలయాలపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

Nara Lokesh Announces World Class State Library in Amaravati
  • అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మిస్తామ‌న్న మంత్రి
  • గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ రూ.100 కోట్ల విరాళం
  • రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌
  • 100 రోజుల్లో ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ యాప్ ఆవిష్కరణ
  • కొత్త జిల్లాల ప్రకారం 26 జిల్లా గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు
రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో రూ.150 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచస్థాయి స్టేట్ లైబ్రరీని నిర్మించనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణాన్ని రాబోయే 24 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం శాసనసభలో గ్రంథాలయాల అభివృద్ధి, సెస్ బకాయిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల భారీ విరాళం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. దాతల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో రూ.20 కోట్లతో ఒక మోడల్ లైబ్రరీ నిర్మాణం చేపడుతున్నామని, మంగళగిరిలో నిర్మించిన మోడల్ లైబ్రరీని అక్టోబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని లోకేశ్ పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అనుగుణంగా ప్రస్తుతం 13గా ఉన్న జిల్లా గ్రంథాలయాల సంఖ్యను 26కు పెంచుతామని, ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉందని వివరించారు.

గ్రంథాలయ సెస్ బకాయిల వసూలుపై కూడా దృష్టి సారించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి బకాయిల వసూలు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఇందుకోసం రూపొందించిన యాప్‌ను వంద రోజుల్లో ఆవిష్కరిస్తామని ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత కోసం అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని, సభ్యుల సూచనలు స్వీకరించి దేశానికే ఆదర్శంగా నిలిచేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Nara Lokesh
Amaravati
State Library
Andhra Pradesh
Libraries Development
Digital Library
Model Libraries
Library Cess
Visakhapatnam
Mangalagiri

More Telugu News