Chandrababu Naidu: అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్.. దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం: సీఎం

Chandrababu Naidu Partners with IBM TCS for Quantum Computing
  • ప్రపంచ ఐటీ నిపుణుల్లో 30 శాతం మంది ఏపీ వారేనన్న చంద్రబాబు
  • ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రం నుంచేనని వెల్లడి
  • అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు
  • ఐబీఎం, టీసీఎస్‌ వంటి దిగ్గజ సంస్థల సహకారం తీసుకోనున్నట్లు స్పష్టం
  • ప్రధాని మోదీ సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడని ప్రశంస
ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రానికి చెందినవారే ఉండటం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సును ఆయన ప్రారంభించి, 'డిజిటల్ ఏపీ' ప్రత్యేక సంచికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం మంది ఏపీ వారే. గట్టి సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి ఇదే నిదర్శనం" అని తెలిపారు. గతంలో తాను నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానానికి చేరిందని గుర్తుచేశారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి వివరిస్తూ, అమరావతిలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. "ప్రముఖ సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం" అని ఆయన వెల్లడించారు. సాంకేతికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని, నేడు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. "ప్రజలకు మేలు చేసే ఎన్నో కొత్త సంస్కరణలను మోదీ తీసుకొచ్చారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ఆయన నిలిచారు" అని కొనియాడారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Computing
Amaravati
IBM
TCS
E-Governance Conference
Digital AP
IT Sector
Narendra Modi

More Telugu News