Danish Kaneria: కొట్టడం వేరు, చితక్కొట్టడం వేరు.. భారత ఓపెనర్లది రెండో రకం: డానిశ్‌ క‌నేరియా

Danish Kaneria on Indias Openers Brahmos Attack Against Pakistan
  • ఆసియా కప్ సూపర్ ఫోర్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
  • సొంత జట్టుపైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా
  • భారత ఓపెనర్లది బ్రహ్మోస్ దాడి అని, పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారని వ్యాఖ్య
  • ఓటమికి ఫఖర్ జమాన్ ను బలిపశువును చేస్తున్నారంటూ ఆరోపణ
  • సంజూ శాంసన్ పట్టింది క్లీన్ క్యాచ్ అని, దానిపై ఏడవద్దని హితవు
ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైన తీరుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిశ్‌ కనేరియా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. భారత ఓపెనర్లు శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ తమ విధ్వంసకర బ్యాటింగ్ తో పాక్ బౌలర్లను బెంబేలెత్తించారని, వారి దాడికి పాక్ ఆటగాళ్లకు దిమ్మతిరిగిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ధశతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుభ్ మన్ గిల్ (28 బంతుల్లో 47) తొలి 10 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్థాన్ ఓటమిని ఖాయం చేశారు. దీంతో భారత్ 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడిన కనేరియా, పాక్ ఆటతీరును తీవ్రంగా విమర్శించాడు. "సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 సంకేతం చూపిస్తే.. శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ తమ బ్యాట్లతో ఏకంగా బ్రహ్మోస్ నే ప్రయోగించారు. భారత ఓపెనర్ల ఎదురుదాడికి పాక్ బౌలర్లు నిస్సహాయులయ్యారు. కొట్టడం వేరు, చితక్కొట్టడం వేరు. ఇది రెండో రకం. దాన్ని మామూలు ఉత‌కడం (ధులాయి) అనరు, మహా ఉతుకుడు అంటారు" అని ఆయన అన్నాడు. అభిషేక్, గిల్ వంటి క్లాస్ ఓపెనర్లు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్ పై 200 పరుగుల లక్ష్యం కూడా చిన్నదేనని క‌నేరియా అభిప్రాయపడ్డాడు.

అంతేకాకుండా, ఓటమికి సాకులు వెతకడం పాకిస్థాన్ కు అలవాటేనని కనేరియా విమర్శించాడు. "ఇప్పుడు వారు ఫఖర్ జమాన్ ఔట్ ను బలిపశువును చేస్తున్నారు. తాను ఔట్ కాలేదని అతడు ఇప్పుడు ఏడుస్తాడు. కానీ సంజూ శాంసన్ పట్టింది స్పష్టమైన క్యాచ్. గ్లోవ్స్ బంతి కింద ఉన్నాయి. అయినా 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' అంటూ పాకిస్థాన్ ఈ అంశంపై రాద్ధాంతం చేస్తుంది" అని ఆయన ఆరోపించాడు.
Danish Kaneria
India vs Pakistan
Asia Cup 2024
Shubman Gill
Abhishek Sharma
Cricket
Pakistan Cricket Team
Indian Cricket Team
Sahibzada Farhan
Super Four Match

More Telugu News