HYDRAA: గాజులరామారం భూ కబ్జాలపై హైడ్రా కొరడా.. 15 వేల కోట్ల విలువైన భూమికి విముక్తి

HYDRAA Cracks Down on Gajulramaram Land Grabs
  • గాజులరామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు రూ.15 వేల కోట్లు
  • ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు, రియల్టర్లు, అధికారుల హస్తం
  • ప్రజావాణి ఫిర్యాదులతో ఆరు నెలల పాటు విచారణ జరిపిన హైడ్రా
  • పేదల ఇళ్లను తొలగించలేదని అధికారుల స్పష్టీకరణ
హైదరాబాద్ మహానగరం శివారులో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, గాజులరామారంలో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన 317 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, కొందరు ప్రభుత్వ అధికారుల అండతో సాగిన ఈ భారీ కబ్జా దందాపై  హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది.

గత ఆరు నెలలుగా ప్రజావాణికి అందిన ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపిన హైడ్రా, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టింది. గాజులరామారంలోని సర్వే నంబర్ 307తో పాటు ఇతర సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను లేఅవుట్లను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. రహదారులు, విద్యుత్ కనెక్షన్లతో దర్జాగా సాగిస్తున్న బడాబాబుల దందాకు అడ్డుకట్ట వేశారు.

ఆక్రమణల తీరు ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన ఈ భూములను, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాల్లో ఏర్పడిన జాప్యాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆక్రమించుకున్నారు. ప్రగతినగర్ వైపు బడా నేతలు, రియల్టర్లు భారీ వెంచర్లు వేయగా, మరోవైపు స్థానిక నాయకులు, రౌడీషీటర్లు పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. 60, 120 గజాల ప్లాట్లుగా విభజించి, వాటిలో చిన్న గదులు నిర్మించి, కుటుంబాలను అద్దె లేకుండా ఉంచి, ఆ తర్వాత అమాయకులకు విక్రయిస్తున్నట్లు హైడ్రా విచారణలో తేలింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్న షేక్ అబీద్ వంటి అనేక మంది ఈ దందాలో పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ కూల్చివేతల్లో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్కడ నివసిస్తున్న పేదలకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అక్రమంగా బోర్డులు పెట్టి ప్లాట్లు అమ్ముతున్న వారే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. స్వాధీనం చేసుకున్న 317 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసే పనులను వేగవంతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
HYDRAA
Hyderabad
HYDRAA Hyderabad
Gajulramaram
Land Scam
Telangana Land
Government Land
Rangnath HYDRAA
Real Estate Hyderabad

More Telugu News