Donald Trump: భారత్-అమెరికా విమాన టికెట్ల ధర పెంపు వెనుక భారీ ఆన్‌లైన్ కుట్ర!

India US flight ticket price hike linked to Trump supporters
  • భారత్-అమెరికా విమాన టికెట్ల ధరల కృత్రిమ పెంపు
  • హెచ్-1బీ వీసాదారులను టార్గెట్ చేసిన ట్రంప్ మద్దతుదారులు
  • 'క్లాగ్ ద టాయిలెట్' పేరుతో ఆన్‌లైన్‌లో భారీ కుట్ర
  • సీట్లను హోల్డ్‌లో పెట్టి డిమాండ్ సృష్టించిన 4చాన్ యూజర్లు
  • ఢిల్లీ-న్యూయార్క్ టికెట్ ధర రూ.37 వేల నుంచి రూ.80 వేలకు ఎగబాకిన వైనం
భారత్ నుంచి అమెరికా వెళ్లే విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడం వెనుక ఓ భారీ ఆన్‌లైన్ కుట్ర దాగి ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హెచ్-1బీ వీసాదారులను అమెరికా రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ మద్దతు బృందం ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), ప్రముఖ ఆన్‌లైన్ ఫోరమ్ ‘4చాన్’ కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తోంది. ‘క్లాగ్ ద టాయిలెట్’ అనే పేరుతో వీరు ఓ ఆపరేషన్ చేపట్టి, కృత్రిమ డిమాండ్ సృష్టించి టికెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజుల పెంపుపై ప్రకటన చేసిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకుంది. సాధారణ రోజుల్లో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు రూ.37,000 ఉండగా, శనివారం నాటికి అది ఏకంగా రూ.80,000 దాటింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

ఈ కుట్రను అమలు చేయడానికి 4చాన్ ఫోరమ్‌లో దాని యూజర్లకు స్పష్టమైన పిలుపునిచ్చారు. "హెచ్-1బీ గురించి భారతీయులకు ఇప్పుడే తెలిసింది. వాళ్లను అక్కడే ఆపాలనుకుంటున్నారా? ఫ్లైట్ రిజర్వేషన్ సిస్టమ్‌ను అడ్డుకోండి. భారత్-అమెరికా మధ్య ప్రధాన రూట్లలో టికెట్లు బుక్ చేసే ప్రక్రియ మొదలుపెట్టి, సీట్లు ఎంపిక చేసుకోండి. కానీ డబ్బులు చెల్లించకుండా 15 నిమిషాల పాటు సీట్లను హోల్డ్‌లో పెట్టండి. ఇదే పనిని పదే పదే చేయండి" అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు.

ఈ పిలుపుతో వందలాది మంది యూజర్లు ఏకకాలంలో వివిధ విమానయాన సంస్థల వెబ్‌సైట్లలోకి వెళ్లి సీట్లను బ్లాక్ చేశారు. దీంతో, నిజంగా టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు ఎయిర్‌లైన్ సిస్టమ్స్ గుర్తించి, అల్గారిథమ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా ధరలను భారీగా పెంచేశాయి. "నేను ఏకంగా 100 సీట్లు బ్లాక్ చేశా" అని ఓ యూజర్ పోస్ట్ చేయడాన్ని బట్టి ఈ కుట్ర ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ డిజిటల్ దాడి కారణంగా ఎందరో భారతీయులు అధిక ధరలు చెల్లించలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Donald Trump
H1B visa
India US flights
flight ticket prices
online conspiracy
MAGA
4chan
Klog the Toilet
India to USA travel

More Telugu News