Rekha Gupta: ఈవీఎంలను మేం హ్యాక్ చేస్తున్నాం.. ఢిల్లీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

Rekha Gupta says We are hacking EVMs Delhi CM sensational comments
  • 70 ఏళ్లుగా కాంగ్రెస్ కూడా అదే చేసిందన్న రేఖా గుప్తా
  • ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందన
  • రేఖా గుప్తా వ్యాఖ్యల వీడియోను 'ఎక్స్'లో పోస్ట్ చేసిన కేజ్రీవాల్
  • క్లిప్ చేసిన వీడియోనే అయినా, పూర్తి వీడియోలోనూ అవే వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్న రేఖా గుప్తా మాటలు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) ట్యాంపరింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. "గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేస్తూనే ఉంది. అప్పుడు ఎవరికీ తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు మేము చేస్తే మాత్రం తప్పుగా కనిపిస్తోంది" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి.

ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు కదా?" అని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రేఖా గుప్తా పైవిధంగా స్పందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజా తీర్పు అని, అదే తాము గెలిస్తే మాత్రం ఈవీఎం హ్యాకింగ్ అని అంటున్నారని ఆమె మండిపడ్డారు. "ఈ ద్వంద్వ నీతి ఏ పుస్తకంలో ఉందో రాహుల్ గాంధీ చెప్పాలి. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఆయనకు ఇంకేమైనా తెలుసా?" అని ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన 13 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. "ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారో చూడండి" అనే వ్యాఖ్యను జోడించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

అయితే, కేజ్రీవాల్ పోస్ట్ చేసింది కేవలం కత్తిరించిన వీడియో అని, పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటూ కొన్ని ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్లు నిమిషంన్నర నిడివి గల అసలు వీడియోను బయటపెట్టాయి. ఆ పూర్తి వీడియోలో కూడా రేఖా గుప్తా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ఈవీఎంల విశ్వసనీయతపై జరుగుతున్న చర్చకు ఆమె వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లయింది.
Rekha Gupta
Delhi CM
EVM hacking
Rahul Gandhi
Aam Aadmi Party
Arvind Kejriwal
Electronic Voting Machines
EVM tampering
Congress party
Indian elections

More Telugu News