Sridhar Vembu: అమెరికాలో ఉన్న భారతీయులు తిరిగొచ్చేయాలి: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు

Sridhar Vembu urges Indians in US to return
  • భారతీయులు దేశానికి తిరిగి వచ్చి జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చన్న శ్రీధర్ వెంబు
  • ఎక్స్ వేదికగా కీలక సూచనలు చేసిన శ్రీధర్ వెంబు
  • శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
  • శ్రీధర్ వెంబు వ్యాఖ్యలపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ట్రంప్ ప్రభుత్వం హెచ్‌1బీ వీసా ఫీజును భారీగా పెంచే ప్రతిపాదనపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వీసా పెంపును ఆయన దేశ విభజనతో పోల్చారు. హెచ్‌1బీ వీసాలతో అమెరికాలో జీవిస్తున్న భారతీయులు భయపడవద్దని, అవసరమైతే దేశానికి తిరిగి వచ్చి జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చని ధైర్యమిచ్చేలా ఆయన సూచించారు.

"నా సింధీ మిత్రుల నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దేశ విభజన సమయంలో వారు కేవలం కట్టుబట్టలతోనే భారత్‌కు వచ్చారు. కానీ, ఇక్కడే తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారు. అదే విధంగా, హెచ్‌1బీ వీసాలపై ఆధారపడినవారు కూడా అమెరికా వదిలి రావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే, భయంతో కాదు... ధైర్యంతో నిర్ణయం తీసుకోవాలి. మన దేశం వారికి మద్దతుగా నిలుస్తుంది," అని వెంబు పేర్కొన్నారు.

తాజా వీసా విధానాల కారణంగా అమెరికాలో ఉద్యోగ భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న వేళ శ్రీధర్ వెంబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. "ఇది భారత్‌కు చెందిన ప్రతిభావంతులకు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు దేశంలో అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఐదు సంవత్సరాలు తీసుకున్నా సరే, మీరు మీ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవచ్చు. అంతిమంగా మీరు లబ్ధి పొందుతారు," అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీధర్ వెంబు అమెరికాలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చారు. తక్కువ వనరులతో జోహో అనే కంపెనీని స్థాపించి, దానిని ప్రపంచ స్థాయి సాస్ రంగంలో శక్తిమంతమైన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ అనుభవం ఆధారంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు.

శ్రీధర్ వెంబు ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం దీనిపై భిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వెంబు వ్యాఖ్యలపై విమర్శలు చేస్తూ, “ఇప్పటికే హెచ్‌1బీ వీసాలో ఉన్నవారికి కొత్త నియమాలు వర్తించవు. ఇది కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే. భయాన్ని వ్యాప్తి చేయొద్దు” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరో నెటిజన్ స్పందిస్తూ, “బెంగాలీలు, పంజాబీలు భారత్‌లో స్థిరపడటానికి చాలా తరాల సమయం పట్టింది. ఇది అంత తేలికైన మార్గం కాదు,” అంటూ వాస్తవ పరిస్థితిని గుర్తు చేశారు. అయితే, కొంతమంది వెంబు వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూ, “భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎదగవచ్చు,” అని సానుకూలంగా స్పందిస్తున్నారు. 
Sridhar Vembu
Zoho CEO
H1B visa
India
United States
Immigration
Job security
Indian professionals
Return to India
Trump administration

More Telugu News