Chandrababu Naidu: నారావారిపల్లె ప్రాజెక్టుకు 'స్కోచ్ గోల్డెన్ అవార్డు'.. సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Naravaripalle Project Wins Skoch Golden Award
  •  సీఎం చంద్రబాబు సొంత ఊరి ప్రాజెక్టుకు జాతీయ పురస్కారం
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • ప్రాజెక్టు కింద 1,600 ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు
  • కేవలం 45 రోజుల్లోనే పనులు పూర్తి చేసిన అధికారులు
  • ఢిల్లీలో అవార్డు అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత గ్రామమైన నారావారిపల్లెలో చేపట్టిన 'స్వర్ణ నారావారిపల్లె' ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మకమైన 'స్కోచ్ గోల్డెన్ అవార్డు' లభించింది. ఈ ప్రాజెక్టు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల సీఎం ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ లో స్పందించారు. "స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టుకు మొదటి సంవత్సరంలోనే స్కోచ్ గోల్డెన్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న బృందాన్ని, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం 45 రోజుల్లోనే 1,600 ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశామని, ఇది కర్బన ఉద్గారాలను తగ్గించి హరిత స్వర్ణాంధ్రకు మార్గం సుగమం చేస్తుందని సీఎం తెలిపారు.

శనివారం నాడు ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఏపీఎస్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సురేంద్ర నాయుడు కలిసి ఈ అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపు రావడం పట్ల జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం రూ. 20.68 కోట్ల వ్యయంతో 1,600 ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు బిగించారు. ఇందులో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 10.19 కోట్లు అందించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 10.49 కోట్లు సమకూర్చింది. దీని ద్వారా ఏర్పాటు చేసిన 3,396 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ల వల్ల ఏటా 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీని విలువ సుమారు రూ. 3.79 కోట్లు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.92 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా.

కాగా, చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె, రంగంపేట, రామిరెడ్డిపల్లి గ్రామాలను కలిపి సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 'స్వర్ణ నారావారిపల్లె విజన్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Chandrababu Naidu
Naravaripalle
Swatch Naravaripalle
APSPDCL
Solar Panels
Andhra Pradesh
Skoch Golden Award
Energy Conservation
Carbon Emission Reduction
Tirupati District

More Telugu News