ABVP: హెచ్‌సీయూ విద్యార్ధి విభాగంలో ఏబీవీపీ ఘన విజయం

ABVP Victory in Hyderabad Central University Student Elections
  • హెచ్‌సీయూ విద్యార్ధి విభాగంలో అధ్యక్షుడిగా శివ పాలెపు గెలుపు
  • ప్రధాన కార్యదర్శిగా శ్రుతి ప్రియ, సంయుక్త కార్యదర్శిగా సౌరభ్ శుక్లా విజయం
  • హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు
ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, ప్రతిష్ఠాత్మకంగా జరిగిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఏబీవీపీ – ఎస్ఎల్‌వీడీ కూటమి సెంట్రల్ ప్యానెల్‌లోని అన్ని పదవులను కైవసం చేసుకుంది.

ఈ ఎన్నికల్లో కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా, శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శిగా, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈసారి ఓటింగ్ శాతం 81శాతం కన్నా ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్‌యూఐ లాంటి ఇతర ప్రధాన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ సత్తా చాటింది.

ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన తర్వాత హెచ్‌సీయూలో కూడా ఏబీవీపీ కూటమి విజయం సాధించడం పట్ల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐటి సెల్ నాయకుడు అమిత్ మాల్వీయా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ తుడిచిపెట్టుకుపోయిందని, రాహుల్ గాంధీ జెన్-జడ్ విప్లవం కలలు తొలగిపోయాయన్నారు. పాట్నా, ఢిల్లీ, జేఎన్యూ, మణిపూర్, గౌహతి, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి విశ్వవిద్యాలయాల్లో కూడా ఏబీవీపీ సత్తా చాటిందని, ఇప్పుడు హెచ్‌సీయూని కైవసం చేసుకుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సిక్స్ ప్యాక్స్ చూపించి స్టేజీలపై తిరగడం యువతను ఆకట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 
ABVP
Akhil Bharatiya Vidyarthi Parishad
HCU
Hyderabad Central University
Student Union Elections
Shiva Palepu
Amit Malviya
NSUI
SFI

More Telugu News