Indian Woman: అమెరికాలో మరో ఘోరం.. దోపిడీని అడ్డుకున్న భారత మహిళను వెంబడించి కాల్చి చంపిన దుండగుడు

Indian Woman Shot Dead During Armed Robbery Authorities Launch Manhunt
  • అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య
  • కన్వీనియన్స్ స్టోర్‌లోకి చొరబడిన సాయుధ దుండగుడు
  • దోపిడీని ప్రతిఘటించిన కిరణ్ పటేల్‌పై కాల్పులు
  • ప్రాణభయంతో బయటకు పరుగెత్తినా వెంబడించి కాల్చివేత
  • నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. సాయుధ దోపిడీని ధైర్యంగా అడ్డుకున్న భారత సంతతికి చెందిన మహిళను ఓ దుండగుడు వెంబ‌డించి మ‌రీ కిరాతకంగా కాల్చి చంపాడు. మృతురాలిని గుజరాత్‌కు చెందిన కిరణ్ పటేల్ (49)గా గుర్తించారు. యూనియన్ కౌంటీలోని పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కిరణ్ పటేల్ స్థానికంగా ‘డీడీస్ ఫుడ్ మార్ట్’ పేరుతో ఒక కన్వీనియన్స్ స్టోర్ నడుపుతున్నారు. మంగళవారం ముసుగు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించాడు. దోపిడీ చేసే ఉద్దేశంతో వచ్చిన అతడిని చూసి కిరణ్ పటేల్ భయపడలేదు. వెంటనే అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. తన చేతికి అందిన ఒక వస్తువును దుండగుడిపైకి విసిరి, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో ఆగ్రహానికి గురైన దుండగుడు ఆమెపై కాల్పుల‌కు తెగ బ‌డ్డాడు. క్యాష్ కౌంటర్‌పైకి దూకి మరీ ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో కిరణ్ పటేల్ స్టోర్ బయట ఉన్న పార్కింగ్ వైపు పరుగులు తీశారు. అయినా ఆ దుండగుడు ఆమెను వదలకుండా వెంబడించి, మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె స్టోర్ ప్రవేశ ద్వారానికి కొద్ది దూరంలోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే యూనియన్ ప్రజా భద్రతా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఈ ఘటన మొత్తం స్టోర్‌లోని సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురికావడంతో స్థానిక ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Indian Woman
Kiran Patel
Indian American woman
robbery
shooting
Union County
New Jersey
Didi's Food Mart
Gujarat
crime
convenience store

More Telugu News