Pawan Kalyan: ఉప్పు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్ కల్యాణ్

Pawan Kalyan to Inspect Damaged Coconut Farms
  • కోనసీమలోని శంకరగుప్తం ప్రాంతంలోని కొబ్బరి తోటల్లోకి తరచు ప్రవేశిస్తున్న సముద్రపు నీరు
  • సముద్రపు ఉప్పు నీరు కారణంగా దెబ్బతింటున్న కొబ్బరి తోటలు
  • దసరా తర్వాత స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనసీమలోని శంకరగుప్తం ప్రాంతంలో సముద్రపు నీటి ప్రవాహానికి గురై దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించనున్నట్లు ప్రకటించారు. సముద్రపు పోటు సమయంలో వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ద్వారా ఉప్పు నీరు తోటల్లోకి చేరడంతో వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు దెబ్బతిన్న సంఘటన తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం వంటి 13 గ్రామాల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. "రైతుల ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. దసరా తర్వాత స్వయంగా ఈ ప్రాంతాలను రైతులతో కలిసి పరిశీలిస్తాను. తోటల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకుంటాను" అని ఆయన అన్నారు.

ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం వివిధ శాఖల అధికారులతో పాటు కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలతో కూడా చర్చలు జరిపి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ఈ ప్రకటనతో నష్టపోయిన తోటల విషయంలో ప్రభుత్వం స్పందిస్తుందన్న ఆశ రైతుల్లో నెలకొంది. 
Pawan Kalyan
Konaseema
Coconut farms
Andhra Pradesh
Saltwater intrusion
Shankara Guptam
Crop damage
Farmers distress
Agricultural loss
Vainateya Paya

More Telugu News