Donald Trump: హెచ్-1బీ వీసా ఫీజు పెంచుతూ ట్రంప్ నిర్ణయం.. తొలిసారిగా స్పందించిన భారత ప్రభుత్వం

Donald Trump H1B Visa Fee Hike Indian Government Responds
  • హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా
  • అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
  • తీవ్రంగా నష్టపోనున్న భారతీయ టెక్ నిపుణులు
  • మానవతా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తం చేసిన భారత్
  • అమెరికా నిర్ణయంపై పరిణామాలను అధ్యయనం చేస్తున్న కేంద్రం
హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును ట్రంప్ ప్రభుత్వం భారీగా పెంచడంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, ఇది మానవతా సంక్షోభానికి దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

అమెరికా, భారత్ దేశాల మధ్య సాంకేతిక అభివృద్ధి, ఆవిష్కరణలకు నైపుణ్యం కలిగిన నిపుణుల రాకపోకలు ఎంతగానో దోహదపడ్డాయని గుర్తు చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాల దృష్ట్యా ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతామని ఆశాభావం వ్యక్తం చేసింది.

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ. 83 లక్షలు) పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వలసలపై కఠిన ఆంక్షలలో భాగంగా శుక్రవారం ట్రంప్ ఈ చరిత్రాత్మక ప్రకటనపై సంతకం చేశారు. ఈ నిర్ణయం అమెరికాలోని భారతీయ ఉద్యోగులపై, ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఇప్పటివరకు హెచ్-1బీ వీసా రుసుము 1,000 నుంచి 5,000 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఒకేసారి లక్ష డాలర్లకు పెంచడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికాలో ప్రస్తుతం హెచ్-1బీ వీసాలు కలిగిన వారిలో 71 శాతం మంది భారతీయులే ఉన్నారు. సుమారు 3 లక్షల మంది మనవాళ్లు ఈ వీసాలపై అక్కడ పనిచేస్తున్నారు.

తాజా విశ్లేషణ ప్రకారం, ఈ కొత్త రుసుము హెచ్-1బీ వీసాపై కొత్తగా ఉద్యోగంలో చేరేవారి సగటు వార్షిక వేతనం కంటే ఎక్కువ. అలాగే, ఇప్పటికే పనిచేస్తున్న వారి సగటు వార్షిక వేతనంలో 80 శాతానికి పైగా ఉండటం గమనార్హం. దీంతో ఈ కార్యక్రమాన్ని దాదాపు రద్దు చేసినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Donald Trump
H-1B visa
H-1B visa fee hike
Indian government response
US India relations
Indian tech professionals

More Telugu News