Amitabh Kant: హెచ్-1బీ ఫీజు పెంపు అమెరికాకు నష్టం, భారత్‌కు లాభం: అమితాబ్ కాంత్

Amitabh Kant Says H1B Fee Hike Hurts US Benefits India
  • హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
  • కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధిస్తూ ఉత్తర్వులు
  • ఈ నిర్ణయంతో అమెరికా ఆవిష్కరణలకు గండి అన్న అమితాబ్ కాంత్
  • ప్రపంచ స్థాయి ప్రతిభ భారత్‌కు తరలివస్తుందని ఆయన జోస్యం
  • హైదరాబాద్, బెంగళూరు వంటి ఐటీ నగరాలకు భారీ లబ్ధి చేకూరుతుందని అంచనా
  • అమెరికా నష్టమే మనకు లాభంగా మారుతుందని స్పష్టం చేసిన అమితాబ్ కాంత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విధానం అమెరికాకు నష్టం కలిగించి, పరోక్షంగా భారత ప్రగతికి ఊతమిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అమెరికా తన తలుపులు తానే మూసుకోవడం ద్వారా భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు.

ఏమిటీ కొత్త నిబంధన?

డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై లక్ష డాలర్ల ఫీజు విధించనున్నారు. ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదు. అమెరికా బయట నుంచి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.

భారత్‌కు ఎలా లాభం?

ఈ నిర్ణయంపై అమితాబ్ కాంత్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల హెచ్-1బీ ఫీజు అమెరికాలోని ఆవిష్కరణలను దెబ్బతీసి, భారత వృద్ధిని వేగవంతం చేస్తుంది. ప్రపంచ స్థాయి ప్రతిభావంతులకు ద్వారాలు మూయడం ద్వారా, అమెరికా తర్వాతి తరం ల్యాబ్‌లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్, పుణె, గుర్గావ్‌లకు తరలి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు.

ఈ పరిణామం వల్ల భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు 'వికసిత భారత్' కలను సాకారం చేసేందుకు దేశ ప్రగతికి దోహదపడే గొప్ప అవకాశం లభించిందని ఆయన తెలిపారు. "అమెరికా నష్టమే మనకు లాభం" అని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పుణె, గుర్గావ్ దేశంలోని కీలక ఐటీ కేంద్రాలుగా ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి.
Amitabh Kant
H-1B visa
Donald Trump
India IT sector
US immigration policy
NITI Aayog
G20 Sherpa

More Telugu News