Kavitha: తొక్కుకుంటూ వెళ్లాల్సిందే: కవిత

Kavitha comments on political competition
  • రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరన్న జాగృతి అధ్యక్షురాలు
  • కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని స్పష్టత
  • చింతమడకలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటానని వెల్లడి
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చోటివ్వరని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. కాంగ్రెస్ లోకి వెళతారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చిచెప్పారు.

హరీశ్ రావుతో విభేదాలపై స్పందిస్తూ.. కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్ రావుపై తనకెలాంటి కోపంలేదన్నారు. నీటిపారుదల శాఖలో ఫైళ్లు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళుతున్నాయని 2016లోనే తాను కేటీఆర్ కు సూచించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, హరీశ్‌రావు, సంతోష్‌ సోషల్‌ మీడియాలు తనపై చేస్తున్న దాడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాగా, ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకలకు తాను హాజరవుతానని కవిత తెలిపారు.

ఆల్మట్టి విషయంలో సుప్రీంకు వెళతాం..
ఆల్మట్టి ఆనకట్ట పెంపు విషయంలో కర్ణాటక ప్రభుత్వ తీరుపై కవిత మండిపడ్డారు. సుప్రీంకోర్టు స్టే విధించినా అక్కడి సర్కారు లెక్కచేయడంలేదని విమర్శించారు. కర్ణాటకను అడ్డుకోకుంటే కృష్ణా నదిలో నీటి చుక్క కూడా మిగలదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టిపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లేదంటే జాగృతి తరఫున తామే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Telangana Politics
Harish Rao
Kaleshwaram Project
Almatti Dam
Krishna River
Congress Party
BC Reservations

More Telugu News