అమెరికాకే ప్రాణసంకటం.. వీసా ఫీజు పెంపుపై అమితాబ్ కాంత్
- భారత్‌కు టర్బోఛార్జ్ అన్న నీతి అయోగ్ మాజీ సీఈవో
- ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని వ్యాఖ్య
- హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును తప్పుబడుతున్న నిపుణులు
అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు దరఖాస్తు చేసే హెచ్ 1బీ వీసాపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ వీసా ఫీజును పెంచినట్లు అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు వెనక్కి తగ్గుతాయన్నదే ట్రంప్ ఉద్దేశమని అంటున్నారు. ఫలితంగా అమెరికన్లకు అవకాశాలు పెరుగుతాయని వాదిస్తున్నారు.
అయితే, ట్రంప్ నిర్ణయం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుందని అమితాబ్ కాంత్ తెలిపారు. వీసా ఫీజు పెంపు వల్ల అమెరికాకు వెళ్లే భారత నిపుణుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని వివరించారు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని తెలిపారు. హెచ్ 1బీ వీసా రెన్యూవల్ ఫీజును పెంచడం ద్వారా అమెరికాలోని భారత ఉద్యోగులకు ట్రంప్ ఓ చక్కటి అవకాశం కల్పించారని, మాతృదేశానికి సేవలందించే మార్గం చూపారని ఆయన పేర్కొన్నారు.