Diamonds: అదృష్టం అంటే ఈ మహిళదే.. పొలంలో వజ్రాల పంట.. వారం రోజుల్లో మారిన తలరాత

Rachana Goldar Lucky Farmer Finds Diamonds in Panna Field
  • మధ్యప్రదేశ్‌లో ఓ రైతు దంపతులకు జాక్‌పాట్
  • పొలంలో తవ్వుతుండగా బయటపడ్డ 8 వజ్రాలు
  • వారం రోజుల వ్యవధిలోనే ఈ అదృష్టం
  • మొత్తం 3.10 క్యారెట్ల బరువున్న వజ్రాలు
  • వేలంలో విక్రయించనున్నట్లు తెలిపిన అధికారులు
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబం తలరాత వారం రోజుల్లోనే మారిపోయింది. పొలంలో మట్టిని తవ్వుతుండగా ఒక మహిళకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది విలువైన వజ్రాలు లభించాయి. ఈ సంఘటనతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

పన్నా పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని బద్గడి ఖుర్ద్ గ్రామానికి చెందిన రచనా గోల్డార్, ఆమె భర్త రాధా రమణ గోల్డార్‌తో కలిసి లీజుకు తీసుకున్న తమ వ్యవసాయ భూమిలో రోజూ మాదిరిగానే తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో మట్టిలో ఏదో మెరుస్తున్న వస్తువు రచన కంటపడింది. పరిశీలించి చూడగా అది వజ్రమని తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే వారికి మొత్తం ఎనిమిది వజ్రాలు దొరికాయి.

దొరికిన వజ్రాలను రచనా గోల్డార్ వెంటనే పన్నాలోని వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు అప్పగించారు. "లీజు తీసుకుని మా పొలంలో గని ఏర్పాటు చేసుకున్నాం. వారం రోజుల్లోనే మాకు ఎనిమిది వజ్రాలు దొరికాయి. పొలంలో నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి, వెంటనే వాటిని కార్యాలయంలో డిపాజిట్ చేశాను" అని రచన తెలిపారు.

వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎనిమిది వజ్రాల మొత్తం బరువు 3.10 క్యారెట్లుగా ఉంది. వీటిలో 0.14 నుంచి 0.79 క్యారెట్ల బరువున్న వజ్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండగా, రెండు కాస్త తక్కువ గ్రేడ్‌లో ఉన్నాయి. త్వరలో జరగబోయే వేలంలో ఈ వజ్రాలను ఉంచుతామని, అప్పుడే వాటి కచ్చితమైన విలువ తెలుస్తుందని ఆయన వివరించారు.

వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నా ప్రాంతంలో ఇలా సామాన్యుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోవడం కొత్తేమీ కాదు. అయితే, వారం వ్యవధిలో ఎనిమిది వజ్రాలు దొరకడం చాలా అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. వేలం తర్వాత ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి మిగిలిన మొత్తాన్ని గోల్డార్ కుటుంబానికి అందజేస్తారు. అనూహ్యంగా కలిసివచ్చిన ఈ అదృష్టంతో తమ కష్టాలు తీరిపోతాయని ఆ దంపతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Diamonds
Madhya Pradesh
Rachana Goldar
Panna district
diamond mining
agricultural land
diamond auction
Badgadi Khurd
Anupam Singh
diamond value

More Telugu News