Arshdeep Singh: టీ20ల్లో చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్.. తొలి భార‌త బౌల‌ర్‌గా అరుదైన రికార్డు!

Arshdeep Singh Creates History First Indian Bowler T20s
  • టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్షదీప్ 
  • నిన్న‌ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత
  • వినాయక్ శుక్లాను ఔట్ చేసి మైలురాయి అందుకున్న యువ పేసర్
  • పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు అర్షదీప్ పేరిటే
  • 64వ మ్యాచ్‌లో వంద వికెట్ల క్లబ్‌లో చేరిన ఎడమచేతి వాటం బౌలర్
భారత యువ పేసర్ అర్షదీప్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న‌ ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్షదీప్ ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు.

మ్యాచ్ 20వ ఓవర్లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లాను ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ సింగ్ తన వందో వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటికే టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న అర్షదీప్, ఇప్పుడు వంద వికెట్ల క్లబ్‌లో చేరి తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నాడు.

2022లో ఇంగ్లండ్‌పై సౌతాంప్టన్‌లో అరంగేట్రం చేసిన అర్షదీప్, తన తొలి మ్యాచ్‌లోనే 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ టీమిండియాలో కీలక బౌలర్‌గా మారాడు. ఈ ఫార్మాట్‌లో కేవలం 64 మ్యాచ్‌ల్లోనే 18.30 సగటుతో 100 వికెట్లు పడగొట్టడం విశేషం. అమెరికాపై 9 పరుగులకు 4 వికెట్లు తీయడం అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.

కాగా, ఈ ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు అర్షదీప్ దూరంగా ఉన్నాడు. జట్టు యాజమాన్యం ప్రధాన పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఒమన్‌తో మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

భారత్ తరఫున అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసింది వీరే..
అర్ష్‌దీప్ సింగ్ - 64 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
యుజ్వేంద్ర చాహల్ - 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు
హార్దిక్ పాండ్యా - 116 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు
జస్‌ప్రీత్ బుమ్రా - 72 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ - 87 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు
Arshdeep Singh
Arshdeep
India cricket
T20 cricket
T20 wickets
Indian bowler
Asia Cup 2025
Jasprit Bumrah
Yuzvendra Chahal
Hardik Pandya

More Telugu News